పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఒక పల్లెలో రెండు పార్టీల మధ్య జరిగిన వివాదంలో టీడీపీ ఇన్‌చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డిని నిందితునిగా చేర్చుతూకేసు నమోదు చేసారు. మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గొట్టిపాళ్లలో గత ఆగస్టు 29వ తేదీన వైసీపీ, టీడీపీ నేతల మధ్య జరిగిన ఘర్షణలో బ్రహ్మారెడ్డిని 12వ నిందితునిగా చేర్చారు. వివరాల్లోకి వెళ్ళితే.... గొట్టిపాళ్లలో గత ఆగస్టు 29వ తేదీన సత్తెమ్మతల్లికి గ్రామస్థులు కుంకుమబండ్లు కట్టారు. ఈ క్రమంలో పసుపు, కుంకుమలు చల్లుకుంటుండగా మాటామాటా పెరిగి టీడీపీ, వైసీపీ నేతలు ఒకరినొకరు నెట్టుకున్నారు. ఈ దాడిలో టీడీపీ నేతరాజబోయిన బాబు కాళ్లను గొడ్డళ్లతో నరికారు. అడ్డొచ్చిన మరో టీడీపీ నేత శివరాజు మెడపై గాయపరిచారు. వైసీపీకి చెందిన పొన్నాల వెంకటేష్, రాజబోయిన రవీంద్రబాబు, సూదినబోయిన అనిల్ తలలు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘర్షణకు సంబంధించి పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తాజాగా ఈ కేసులో బ్రహ్మారెడ్డితోపాటు మొత్తంగా 15 మందిని చేర్చారు. ఏ10గా ఉన్న రాజబోయిన మధుయాదవ్ అజ్ఞాతంలోకి వెళ్లగా, నాలుగు రోజుల క్రితం ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అక్రమ కేసు పెట్టారని స్పష్టమవుతోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.