తిరుమల శ్రీవారి భక్తులకు బ్యాడ్ న్యూస్. ఐదు రోజుల పాటూ సర్వ దర్శనం (ఎస్‌ఎస్‌డీ) టికెట్లను జారీని రద్దు చేశారు. పెరటాసి శనివారాల నేపథ్యంలో తిరుమలలో కొనసాగుతున్న అధిక రద్దీ దృష్ట్యా, టీటీడీ ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీని రద్దు చేసింది. ఈ మేరకు తిరుపతిలో అక్టోబర్ 6, 7, 8, 13, 14, 15 తేదీలలో ఎస్ ఎస్ డి టోకెన్లు జారీ చేయబడవని తెలిపింది టీటీడీ. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరారు.
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈ సందర్భంగా శ్రీకామాక్షి అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఉత్సవాల నేపథ్యంలో అక్టోబరు 11న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు.శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 16న శ్రీ కామాక్షి దేవి, 17న శ్రీ ఆదిపరాశక్తి, 18న మహాలక్ష్మి, 19న శ్రీ అన్నపూర్ణాదేవి, 20న దుర్గాదేవి, 21న శ్రీ మహిషాసురమర్థిని, 22న శ్రీ సరస్వతిదేవి, 23న విజయదశమి సందర్భంగా శ్రీ శివపార్వతుల అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీతం, దేవి భాగవతంపై పురాణ ప్రవచనం, లలితసహస్రనామ పారాయణం కార్యక్రమాలు నిర్వహిస్తారు.