తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక. వైకుంఠ ఏకాదశి సందర్భంగా దర్శనాలకు సంబంధించి టీటీడీ ఈవో ధర్మారెడ్డి క్లారిటీ ఇచ్చారు. డిసెంబరు 23 నుంచి జనవరి 1 వరకు 10 రోజుల పాటు జరిగే వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ఆన్‌లైన్‌లో రోజుకు 20 వేల చొప్పున మొత్తం 2 లక్షల టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామన్నారు. అదేవిధంగా రూ.300 దర్శన టికెట్లు తిరుపతిలో ఆఫ్‌లైన్ ద్వారా రోజుకు 50 వేల చొప్పున మొత్తం 5 లక్షల టైంస్లాట్ టోకెన్లను విడుదల చేస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఆన్‌లైన్ కోటా విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు.
మరోవైపు టీటీడీలో విపత్తుల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలపై ఈవో ధర్మారెడ్డి తిరుమల అన్నమయ్య భవనంలో సమీక్ష నిర్వహించారు. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. సి.నాగరాజు, యూనిసెఫ్ కన్సల్టెంట్ అమల్ కృష్ణ రూపొందించిన డాక్యుమెంటును పరిశీలించారు. అనంతరం వారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డాక్యుమెంట్ లోని అంశాలను తెలియజేశారు. సెప్టెంబరు 18 నుంచి అక్టోబరు 17 వరకు పెరటాసి మాసం కారణంగా గత శుక్ర, శని, ఆది, సోమవారాల్లో అనూహ్యంగా భక్తులు తరలివచ్చారన్నారు. టీటీడీ, విజిలెన్స్ సిబ్బంది, శ్రీవారి సేవకులు, టీటీడీ విద్యాసంస్థలకు చెందిన ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు కలిసి భక్తులకు విశేషంగా సేవలందించారన్నారు. రాబోయే పెరటాసి రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులకు విస్తృతంగా సేవలందించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. పెరటాసి శనివారాలు, వరుస సెలవుల కారణంగా ఆధిక రద్దీ దృష్ట్యా, ఎస్‌ఎస్‌డి టోకెన్ల జారీని రద్దు చేశామని.. తిరుపతిలో అక్టోబర్ 6, 7, 8, 13, 14, 15వ తేదీలలో ఎస్‌ఎస్‌డి టోకెన్లు జారీ చేయబడవన్నారు. భక్తులు నేరుగా తిరుమలకు వచ్చి సర్వదర్శనానికి వెళ్లవచ్చని.. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరారు.
ప్రతి ఏటా జరిగే ఉత్సవాల నేపథ్యంలో భారీగా వచ్చే యాత్రికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని క్రమబద్ధీకరణ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఈవో ధర్మారెడ్డి. అదేవిధంగా ట్రాఫిక్ మేనేజ్మెంట్, అగ్ని ప్రమాదాలు, వరదలు ఇతర విపత్తులను ఎదుర్కొనేందుకు ఎప్పటికప్పుడు సంబంధిత నిపుణుల సహకారం తీసుకోవాలన్నారు. విపత్తుకు ముందు, విపత్తు జరిగిన సమయంలో, ఆ తర్వాత టీటీడీలోని ప్రతి విభాగం తీసుకోవాల్సిన ముందస్తు చర్యల గురించి వివరించారు. ఒక్కోరకం విపత్తుకు ఒక అధికారిని ఏర్పాటుచేసి వారితో తరచూ సమావేశాలు నిర్వహించి విపత్తుల నివారణ ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.
టీటీడీలోని పలు విభాగాల్లో విపత్తుల నివారణ ఎలా చేయవచ్చు, అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలను కూలంకషంగా డాక్యుమెంటులో పొందుపరిచినట్లు తెలిపారు నాగరాజు, అమల్ కృష్ణ. ఈ డాక్యుమెంటులో క్యూలైన్ల క్రమబద్ధీకరణ, ప్రవేశ, నిష్క్రమణ మార్గాల వ్యూహాలు, ఉత్సవాల నిర్వహణ, మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు, దివ్యాంగుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతోపాటు ప్రకృతి విపత్తులు, మానవ తప్పిదాల వల్ల జరిగే విపత్తులు, అగ్నిప్రమాదాలు, విద్యుత్ ప్రమాదాలు, తాగునీరు, కల్తీ ఆహారం, అపరిశుభ్రత వల్ల కలిగే విపత్తులు, ఘాట్ రోడ్లు, నడకదారుల్లో సంభవించే విపత్తుల నివారణ చర్యలను పొందుపరిచారు. ఈ సందర్భంగా ఈవో వారిని అభినందించి శ్రీవారి ప్రసాదంతో సన్మానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa