ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబు,,,,ప్రివిలేజ్డ్ దర్శనాలు రద్దు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 07, 2023, 08:04 PM

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 15 నుంచి 23 వరకు జరగనున్నాయి. అక్టోబరు 19న గరుడసేవ సందర్భంగా అక్టోబరు 17 నుండి 19వ తేదీ వరకు కాటేజి దాతలకు గదుల కేటాయింపు ఉండదని తెలిపారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. బ్రహ్మోత్సవాల మిగతా రోజుల్లో యధావిథిగా ఉంటుందన్నారు. దాతలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. శ్రీవారి బ్రహ్మోత్సవాల కారణంగా అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకరణ సేవలు రద్దు చేసినట్లు ఈవో తెలిపారు. ముందస్తుగా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవాటికెట్లు బుక్‌ చేసుకున్న గృహస్తులను వారికి సూచించిన వాహనసేవలకు మాత్రమే అనుమతించడం జరుగుతుంది. వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు తదితర ప్రివిలేజ్డ్‌ దర్శనాలను రద్దు చేశారు.


అక్టోబర్‌ 29న చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేస్తున్నట్లు ఈవో తెలిపారు. అక్టోబర్‌ 29వ తేదీన పాక్షిక చంద్రగ్రహణం కారణంగా అక్టోబర్‌ 28న రాత్రి 7.05 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేసి అక్టోబరు 29వ తేదీ తెల్లవారుజామున 3.15 గంటలకు తెరుస్తారన్నారు. ఎనిమిది గంటల పాటు ఆలయ తలుపులు మూసి ఉంటాయని.. అక్టోబర్‌ 29వ తేదీ తెల్లవారుజామున 1.05 నుండి 2.22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం పూర్తవుతుంది అన్నారు. అంతేకాదు చంద్రగ్రహణం కారణంగా తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనాన్ని అక్టోబరు 28న సాయంత్రం 6 గంటలకు మూసివేసి అక్టోబరు 29న ఉదయం 9 గంటలకు తెరుస్తారు. ఈ సమయంలో అన్నప్రసాదాల పంపిణీ ఉండదు కావున భక్తులు గుర్తించాలని కోరారు. అక్టోబర్‌ 28న సహస్రదీపాలంకారసేవను, వికలాంగులు, వయోవృద్ధుల దర్శనాన్ని రద్దు చేసింది టీటీడీ.


మరోవైపు అటవీశాఖ అధికారులు అలిపిరి కాలినడక ప్రాంతంలో ఇప్పటివరకు ఆరు చిరుతలను బంధించామన్నారు టీటీడీ ఈవో. ట్రాప్ కెమెరాల 15 రోజుల పాటు పూర్తిగా పరిశీలించిన తర్వాత ఎలాంటి ముప్పు లేదని నిర్ధారించారు. దీంతో సెప్టెంబరు 29వ తేదీ నుంచి ఘాట్‌ రోడ్లలో రాత్రి 10 గంటల వరకు ద్విచక్ర వాహనాలను అనుమతిస్తున్నాం. 12 ఏళ్ల‌లోపు చిన్న‌పిల్ల‌ల‌ను మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కే అనుమతిస్తునమన్నారు. వైల్డ్‌లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిపుణులు అలిపిరి కాలిన‌డ‌క మార్గాన్ని రెండు రోజుల‌పాటు ప‌రిశీలించి వారంలో నివేదిక ఇస్తామ‌ని తెలిపారు. వారి సూచ‌న‌ల మేర‌కు త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామన్నారు. మరోవైపు టీటీడీ నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేస్తోంది. గత నెలలో నిర్వహించిన సాలకట్ల బ్రహ్మోత్సవాలకు భక్తుల రద్దీ పెద్దగా లేదని.. కానీ నవరాత్రి బ్రహ్మోత్సవాలకు రద్దీ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తామంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa