తిరుమలలో యుపీఐ విధానంలో చెల్లింపులు చేసి గదులు పొందిన భక్తులకు వారు గదులు ఖాళీ చేసిన ఒక గంటలోపు కాషన్ డిపాజిట్ మొత్తం రీఫండ్ చేయడం జరుగుతోందన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో పలు కీలక అంశాలపై క్లారిటీ ఇచ్చారు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేసి గదులు పొందిన భక్తులకు ఖాళీ చేసిన ఒక గంటలోనే రీఫండ్ ప్రక్రియను మొదలుపెడతారన్నారు. అయితే ఈ మొత్తం భక్తుల బ్యాంకు ఖాతాల్లోకి చేరడానికి 3 నుంచి 7 పనిదినాల సమయం పడుతుంది అన్నారు. భక్తులు గది ఖాళీ చేసినపుడు మొదటిసారి, రీఫండ్ ప్రక్రియ మొదలైనపుడు రెండోసారి, బ్యాంకులో రీఫండ్‌కు సంబంధించిన లావాదేవీ జరిగినపుడు బ్యాంకు నంబరుతో మూడోసారి భక్తులకు ఎస్‌ఎంఎస్ పంపడం జరుగుతోందన్నారు. రీఫండ్ కోసం కొందరు భక్తులు సొమ్ము చెల్లించిన బ్యాంకును కాకుండా మరో బ్యాంకు స్టేట్‌మెంట్‌ను తప్పుగా సరిచూసుకుంటున్నారన్నారు. ఎస్‌ఎంఎస్ ప్రకారం 3 నుంచి 7 రోజులు వేచి ఉండడం లేదన్నారు.
కొందరు నిబంధనల మేరకు గది ఖాళీ చేయడం లేదని.. వెరిఫికేషన్ కోడ్ చూపకపోవడం, ఫొటో సరిపోలకపోవడంతో రీఫండ్ జనరేట్ కావడం లేదన్నారు. ప్రస్తుతం రీఫండ్‌కు సంబంధించిన సమాచారాన్ని ఎస్‌ఎంఎస్ ద్వారా పంపుతున్నామని తెలిపారు. త్వరలో రీఫండ్‌ను ట్రాక్ చేసేందుకు టీటీడీ వెబ్‌సైట్‌లో ట్రాకర్‌ను పొందుపరుస్తాము అన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ పవిత్రత, విశిష్టతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు టీటీడీ ఈవో. తిరుమలలో రాజకీయ నాయకులు రాజకీయ విమర్శలు చేయడం బాధాకరమని ఓ భక్తుడు ఈవోతో అన్నారు. శ్రీవారి ఆలయ పవిత్రతను , వైభవాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి ధర్మమన్నారు ఈవో. మీడియా ప్రతినిధులు తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే రాజకీయ ప్రముఖులను వారి ఆధ్యాత్మిక అనుభూతులను గురించి ప్రశ్నలు వేస్తే బాగుంటుందని సూచించారు. తిరుమల పవిత్రతను కాపాడటంలో ప్రతి ఒక్కరు టీటీడీకి సహకారం అందించాలని ఈవో కోరారు.
ఎస్ ఎస్ డి టోకెన్ల వివరాలు ఆన్‌లైన్లో విడుదల చేయడం సాధ్యం కాదని.. తిరుపతిలో ఏ రోజు దర్శనానికి ఆ రోజే ఎస్ ఎస్ డి టోకెన్లు జారీ చేస్తారని గుర్తు చేశారు. అంగప్రదక్షిణ టికెట్ల కోటా పరిమితంగా ఉంటుందని.. ఆఫ్‌లైన్‌లో ఎక్కువమంది క్యూలో వేచి ఉండడం వల్ల ఇబ్బంది పడుతున్నారన్నారు. కావున ఆన్లైన్‌లో బుక్ చేసుకోవాలని సూచించారు. శ్రీవారి సేవకులకు, పరకామణి సేవకులకు ఒక సారి శ్రీవారి దర్శనం, ఒక లడ్డూ ఇస్తున్నామన్నారు. కల్యాణకట్టలో తలనీలాల సమర్పణకు క్షురకులు భక్తులను డబ్బులు డిమాండ్ చేసే వారిపై చర్యలు తీసుకున్నామన్నారు. భక్తులు ఎవ్వరు కూడా క్షురకులకు, గదుల వద్ద లగేజి కౌంటర్ల వద్ద ఉన్న సిబ్బందికి డబ్బులు ఇవ్వకూడదన్నారు. తిరుమలలోని హోటళ్లలో అధిక ధరల అంశంపైనా ఈవో స్పందించారు. వేలంలో అధిక ధరలకు కోట్ చేసి తిరుమలలో హోటళ్లు పొందుతున్నారన్నారు. ఎక్కువ ధరలకు ఆహారం విక్రయిస్తునారని.. వీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అన్నమయ్య భవన్, నారాయణగిరి ఏపీ టూరిజంకు తక్కువ అద్దెతో కేటాయించామని.. ఇక్కడ తక్కువ ధరలకు ఆహార పదార్థాలు భక్తులకు అందిస్తారన్నారు. శుక్రవారం అభిషేకం, అలంకరణ కారణంగా నాలుగు గంటల సమయం అవుతోందన్నారు. భక్తులు దర్శనం కోసం అధిక సమయం వేచి ఉంటారని.. నిజపాద దర్శనం కోసం మరికొంత సమయం కావాల్సి ఉంటుంది అన్నారు. కావున శుక్రవారం నిజ పాద దర్శనాలను టీటీడీ బోర్డు రద్దు చేసిందన్నారు. టీటీడీ వెబ్ సైట్‌లో దర్శనం, సేవ టికెట్ల పేమెంట్ చేసేటప్పుడు సమస్యలు రాకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa