ప్రకాశం బ్యారేజ్‌కు మరో అరుదైన గుర్తింపు లభించింది. ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడంగా ప్రకాశం బ్యారేజ్‌ను ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ (ఐసీఐడీ) ఎంపిక చేసింది. ఈ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌కు ఐసీఐడీ డైరెక్టర్ అవంతివర్మ లేఖ రాశారు. వ్యవసాయంలో సమర్ధవంతంగా నీటిని వినియోగించే హెరిటేజ్ స్ట్రక్చర్లను గుర్తించేందుకు ఈరంగంలో పరిశోధనలు జరిపే పరిశోధకులను ప్రోత్సహించే లక్ష్యంతో ఐసీఐడీ ఈ అవార్డులను ఏర్పాటు చేసింది. వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్ -2023 అవార్డులకు ఐసీఐడీ, ఐఎన్సిడీల తరపున నామినేషన్లు కోరగా వచ్చిన నామినేషన్లలో 19 నిర్మాణాలను ఈ అవార్డులకు ప్యానల్ జడ్జెస్ సిఫార్సు చేసి ఎంపిక చేయగా వాటిలో భారతదేశం నుంచి 4 నిర్మాణాలను వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్-2023 అవార్డుకు ఎంపిక చేశారు.
దేశం నుంచి ఎంపికైన 4 నిర్మాణాలలో కృష్ణా నదిపై ఉన్న ప్రకాశం బ్యారేజితో పాటు ఒడిశాలోని బలిద్హిహా ప్రాజెక్టు, జయమంగళ ఆనకట్టలు,తమిళనాడులోని శ్రీవాయికుంటం ఆనకట్ట ఈ అవార్డుకు ఎంపికైనట్టు తెలిపారు.ఈవిధంగా ఎంపికైన నిర్మాణాలను వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్లకు సంబంధించిన ఐసిఐడి రిజిష్టర్ లో నమోదు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్ అవార్డుకు ఎంపికైన రాష్ట్రాలకు నవంబరు 2 నుంచి 8 వరకూ విశాఖపట్నంలో జరిగే 25వ ఐసీఐడీ కాంగ్రెస్.. 74వ ఐఈసీ సమావేశంలో ఈ అవార్డులను ఆయా రాష్ట్రాలకు ప్రదానం చేయనున్నారు. ఈసమావేశానికి సంబంధించిన ఆహ్వానపత్రికను త్వరలో ఆయా రాష్ట్రాలకు పంపిస్తారు. ఈ అవార్డులకు ఎంపికైన రాష్ట్రాలు 25వ ఐసీఐడీ కాంగ్రెస్, 74వ ఐఈసీ సమావేశానికి హాజరగుటకు రిజిష్టర్ చేసుకోవాలన్నారు.
ప్రకాశం బ్యారేజ్‌తో కలిపి రాష్ట్రంలో ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడాలుగా ఐసీఐడీ గుర్తించిన ప్రాజెక్టుల సంఖ్య ఐదుకు చేరుకుంది. ఇప్పటికే కేసీ (కర్నూలు–కడప) కెనాల్, కంభం చెరువు, పోరుమామిళ్ల చెరువులను 2020లో.. సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజ్‌ను 2022లో ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడాలుగా ఐసీఐడీ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా జలవనరుల సంరక్షణ.. తక్కువ నీటితో అధిక ఆయకట్టుకు నీళ్లందించే విధానాలపై అధ్యయనం చేస్తారు. వాటి ఫలాలను దేశాలకు అందించడమే లక్ష్యంగా 1950, జూన్ 24న ఐసీఐడీ ఏర్పాటైంది. పురాతన కాలంలో నిర్మించి.. ఇప్పటికీ ఆయకట్టుకు నీళ్లందిస్తున్న సాగునీటి కట్టడాలను ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడాలుగా ఎంపిక చేసి అవార్డులను ప్రదానం చేస్తోంది. ప్రకాశం బ్యారేజీకి అరుదైన గుర్తింపు లభించడంపై అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa