ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కృష్ణాజలాల అంశంపై,,,, ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్ లేఖ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 07, 2023, 08:33 PM

ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ లేఖ రాశారు. కృష్ణాజలాల అంశంలో ఏపీ ప్రజల ఆందోళనలను పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తదుపరి చర్యలు తీసుకోకుండా నిలిపేయాలని కోరారు. 1956 నాటి అంతర్‌ రాష్ట్ర నదీజలాల వివాద చట్టం లోని సెక్షన్ 4 ప్రకారం కృష్ణా జలవివాద ట్రిబ్యునల్‌ -1 (బచావత్‌, కేడబ్ల్యూడీటీ-1)ని కేంద్రం ఏర్పాటు చేసింది అన్నారు. కేడబ్ల్యూడీటీ -I ఇచ్చిన తుది నివేదిక ఆధారంగా 1976, మే 31న దీన్ని గెజిట్‌ చేసిందన్నారు. కృష్ణానదిలో 2130 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని కేడబ్ల్యూడీటీ -I ట్రైబ్యునల్‌ లెక్కకట్టిందన్నారు. 75శాతం ప్రవాహాలు ఉంటాయన్న అంచనాతో ఈ లెక్క వేసిందని.. దీని ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికికేడబ్ల్యూడీటీ-I 811 టీఎంసీల నీటిని కేటాయించింది అన్నారు. 2130 టీఎంసీల కన్నా అధికంగా ఉన్న నీటిని, మిగులు ప్రవాహాలను ఉపయోగించుకునేలా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి స్వేఛ్చను ఇచ్చిందన్నారు. ఐఎస్ఆర్ డబ్ల్యూడి  చట్టం, 1956లోని సెక్షన్ 6(1) ప్రకారం,కేడబ్ల్యూడీటీ-I చేసిన అవార్డును సుప్రీం కోర్ట్ డిక్రీ ద్వారా అమల్లోకి వచ్చిందని తెలిపారు.


తదనంతరం, ఐఎస్ఆర్ డబ్ల్యూడిి చట్టం, 1956లోని సెక్షన్ 4 (1) ప్రకారం 02.04.2004న కేడబ్ల్యూడీటీ-II (బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్)ని కేంద్రం ఏర్పాటు చేసిందన్నారు. ఈ ట్రిబ్యునల్‌ 30.12.2010న తన ‘నివేదిక’ని సమర్పించిందన్నారు. కేడబ్ల్యూడీటీ-II (బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్) 29.11.2013న సెక్షన్ 5(3) ప్రకారం కేడబ్ల్యూడీటీ-I ద్వారా ఇప్పటికే 75% డిపెండబిలిటీతో చేసిన 2,130 టీఎంసీల కేటాయింపులను నిర్ధారిస్తూ తన ‘తదుపరి నివేదిక’ను సమర్పించిన విషయాన్ని గుర్తు చేశారు. దీంతో పాటు బేసిన్ రాష్ట్రాలకు సగటు ప్రవాహాలతో సహా 65% ఆధారపడదగిన అదనపు నీటిని కూడా కేటాయించిందన్నారు. దీని కింద, పూర్వపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 194 టీఎంసీ కేటాయించబడిందని.. ఈ విధంగా, పూర్వపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చేసిన మొత్తం కేటాయింపు 1005 టీఎంసీ (811 టీఎంసీ +194 టీఎంసీ) వరకు చేరుతుందన్నారు. దీంతో పాటు 2578 టీఎంసీ కంటే ఎక్కువుగా ఉండే అదనపు ప్రవాహాలను ఉపయోగించుకోవడానికి పూర్వపు ఆంధ్రప్రదేశ్‌కు స్వేఛ్చను ఇచ్చిందన్నారు.


కేడబ్ల్యూడీటీ-II యొక్క నిర్ణయాన్ని సవాల్‌చేస్తూ సుప్రీంకోర్టులో 5 ఎస్ఎల్పీలను కృష్ణానదీజలాలపై ఆధారపడ్డ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో దాఖలు చేశాయని తెలిపారు. సెక్షన్ 5(2) ప్రకారం కేడబ్ల్యూడీటీ-II నివేదికను పక్కన పెట్టాలంటూ పూర్వపు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం సుప్రీంకోర్టును అభ్యర్థించిందన్నారు. సుప్రీం కోర్ట్ తన ఉత్తర్వుల ద్వారా 16.09.2011న కేడబ్ల్యూడీటీ-IIపై స్టే ఇచ్చిందన్నారు.. అన్ని ఎస్ఎల్పీలు సుప్రీంకోర్టు ముందు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. దీనికి సంబంధించి, నేను ఈ సమస్యను కేంద్ర జలశక్తిశాఖ మంత్రి దృష్టికి 17.08.2021న.. ఆ తర్వాత 25-06-2022న తీసుకొచ్చామన్నారు. ట్రిబ్యునల్‌ ద్వారా జరిగిన కేటాయింపులకు ఎలాంటి భంగంరాకుండా చట్టపంగా న్యాయబద్ధమైన నిర్ణయం తీసుకోవాలని కోరడం జరిగిందన్నారు.


ఇది ఇలా ఉండగా, ఐఎస్ఆర్ డబ్ల్యూడిి చట్టం, 1956 సెక్షన్ 5(1) ప్రకారం కేడబ్ల్యూడీటీ-IIకి విధివిధానాలు జారీకి 4.10.2023న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. 14.07.2014న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థన, ఫిర్యాదు ప్రకారం ఈ విధివిధానాలు కేవలం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకే పరిమితం చేయబడ్డాయన్నారు. కేంద్ర మంత్రివర్గం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కృష్ణానది ప్రవాహాలపై ఆధారపడిన ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగే అవకాశం ఉందన్నారు.


రెండు రాష్ట్రాలకు (ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ) మాత్రమే వీటిని పరిమితం చేయడం.. కృష్ణా పరీవాహక ప్రాంతంలోని ఇతర రెండు రాష్ట్రాలను (మహారాష్ట్ర మరియు కర్ణాటక) పూర్తిగా మినహాయించాలని ఏకపక్షంగా సూచించడం అశాస్త్రీయమని దృఢంగా విశ్వసిస్తున్నాను అన్నారు. ఇది జాతీయ ఆస్తి అయిన నీటి వనరులను న్యాయంగా వినియోగించుకోవడానికి వ్యతిరేకమైంది కూడా అని ప్రస్తావించారు. పైన పేర్కొన్న వాస్తవాలను పరిగణలోకి తీసుకుని.. ఇందులో ఉన్న న్యాయపరమైన చిక్కులను పరిశీలించి.. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని.. తదుపరి చర్యలు తీసుకోకుండా సంబంధిత వ్యక్తులను ఆదేశించవలసిందిగా కోరుతున్నాను అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa