ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆశా కార్యకర్త కృపమ్మ కుటుంబానికి టీడీపీ అండ,,,,రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించిన లోకేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 09, 2023, 08:36 PM

ఆశా కార్యకర్త కృపమ్మ కుటుంబానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) అండగా నిలిచారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఈ నెల 6న నిర్వహించిన ‘జగనన్న సురక్ష’ కార్యక్రమంలో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయారు. కృపమ్మ కుటుంబానికి నారా లోకేష్ రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఆ నగదును ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ.. బాధిత కుటుంబ సభ్యులకు ఆదివారం అందజేశారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోయినా పని ఒత్తిడి కారణంగానే కృపమ్మ మృతి చెందారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.


ఆశావర్కర్లు అధిక పని ఒత్తిడికి గురువుతున్నారన్నారు పంచుమర్తి అనురాధ. రేపూడి కృపమ్మ కుటుంబానికి నారా లోకేష్ రూ. 2 లక్షల ఆర్థిక సహాయం చేశారని.. టీడీపీ, సీఐటీయూ రెండు రోజుల నిరసనతోనే జగన్‌ ప్రభుత్వం దిగి వచ్చిందన్నారు. ఆశావర్కర్లు దేవుళ్లతో సమానం.. ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకపోయిన అధిక పని ఒత్తిడి కారణంగానే కృపమ్మ మృతి చెందారన్నారు. నారా లోకేష్ బాధలో ఉన్నప్పటికీ నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటున్నారని.. సరైన ట్రైనింగ్ ఇవ్వకుండా ఆశావర్కర్లను ఒత్తిడికి గురి చేస్తున్నారన్నారు. అరకొర జీతాలు ఇస్తూ అశావర్కర్లకు జగన్ ప్రభుత్వం ఇస్తున్న నవరత్నాలను ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వ పథకాలు అందక అరకొర జీతాలతో ఆశావర్కర్లు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఆరోగ్య సురక్ష పేరుతో ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్న బీపీ, షుగర్ మందులే ఇస్తున్నారన్నారు.


ఏపీ ప్రభుత్వం చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని తాడేపల్లిలోని ప్రకాశ్‌నగర్‌ వైఎస్‌ఆర్‌ అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌లో నిర్వహించారు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఆశావర్కర్‌ కృపమ్మ ఒక్కసారిగా కుప్పకూలి పోయారు. సిబ్బంది వెంటనే ఆమెను విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. వైద్యారోగ్యశాఖ అధికారుల ఒత్తిడే ఆమె మృతికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు మృతురాలి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని సీఐటీయూ డిమాండ్‌ చేసింది.


ఆశా కార్యకర్త కృపమ్మకు న్యాయం చేయాలంటూ తోటి వర్కర్లు ధర్నా చేశారు. అధికారుల పని ఒత్తిడితోనే కృపమ్మ ప్రాణాలు కోల్పోయిందని.. ఆమె కుటుంబ సభ్యులకు నష్టపరిహారం అందించాలని కోరుతూ తాడేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఆశా వర్కర్లు, యూనియన్ నేతలు బైఠాయించారు. మృతురాలి కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమపై పని భారం తగ్గించాలని.. సెలవులు ఇవ్వాలని నినాదాలు చేశారు. ఆశా కార్యకర్తలతో పగలు, రాత్రీ తేడా లేకుండా పని చేయిస్తున్నారని.. తోటి కార్యకర్తలు తెలిపారు. ఉదయం 7 గంటలకల్లా అందరూ విధుల్లో పాల్గొనాలని ఆదేశాలు జారీ చేయడంతో అల్పాహారం తీసుకోకుండానే విధులకు హాజరయ్యామని చెప్పారు.ఆశా వర్కర్ల ఆందోళనకు తెలుగుదేశం పార్టీ నేతలు మద్దతు ప్రకటించి ధర్నాలో పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లను, తెలుగుదేశం పార్టీ నేతలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa