ఫ్లైఓవర్‌పై బైక్‌తో వేగంగా వెళ్తున్న ఓ యువకుడు తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వంతెనపై బైకర్ అతివేగంగా వెళ్తూ.. ఓ మలుపు వదద్ద వాహనంపై నియంత్రణ కోల్పోయి సైడ్ వాల్‌ను ఢీకొట్టాడు. ఫ్లై ఓవర్ పైనుంచి కిందపడబోయాడు. అయితే, అదృష్టవశాత్తూ.. సైడ్ వాల్ అంచుకు తాకి, లోపలి వైపే పడిపోయాడు. ఆ సమయంలో బైక్ వెనుక వస్తున్న కారు డ్రైవర్.. ప్రమాదాన్ని గ్రహించి వాహనాన్ని నిలిపివేశాడు. ఫ్లైఓవర్ పైనుంచి కిందపడినా.. వెనుక నుంచి వచ్చిన వాహనాలు మీద నుంచి వెళ్లినా.. ఆ బైకర్ ప్రాణాలు కోల్పోయేవాడే. తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
సూరత్‌లోని ఫ్లైఓవర్‌పై సోమవారం (అక్టోబర్ 9) ఉదయం 9.56 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బైక్ వెనుక ఉన్న ఓ కారు డాష్ బోర్డు కెమెరాలో ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అవుతోంది. ఇరుకైన ఫ్లైఓవర్‌పై కారును ఓవర్‌టేక్ చేసుకొని వచ్చిన బైకర్.. మలుపు వద్ద నియంత్రణ కోల్పోయాడు. పిట్టగోడను ఢీకొట్టి వంతెన అంచుకు తాకి అక్కడే పడిపోగా.. బైక్ అలాగే ముందుకువెళ్లి కాస్త దూరంలో పడిపోయింది. వెంటనే తేరుకొని పైకి లేచిన యువకుడు.. బైక్ వెంట పరుగు అందుకోవడం ఈ ఘటనలో మరో ఆసక్తికర అంశం.
ప్రమాదానికి గురైన బైకర్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. బైకర్ల ఆగడాలు మితిమీరిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంత కాలంగా యువకుడు బైక్‌లతో రెచ్చిపోతున్నారని.. దేశంలోని అన్ని నగరాల్లో ఈ సమస్య ఉందని అంటున్నారు. హైవేలలో, ప్రధాన రహదారుల్లో, చివరికి ఫ్లైఓవర్లపై బైకర్లతో సమస్యలు ఎదురవుతున్నాయని కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ ప్రమాదాన్ని గమనించి.. కారు యజమాని, కొంత మంది బైకర్లు తమ వాహనాలను అక్కడే నిలిపివేయగా.. మరి కొంత మంది బైకర్లు మాత్రం.. తమకేమీ పట్టనట్లు అలాగే ముందుకుపోవడం గమనార్హం.