ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య, దాని అనంతరం జరిగిన పరిణామాలతో భారత్, కెనడాల మధ్య ఉన్న సంబంధాలు దారుణంగా పడిపోయాయి. ఇరు దేశాలు దౌత్య వేత్తలను బహిష్కరించడం వరకు వెళ్లాయి. దీంతో భారత్, కెనడా మధ్య దౌత్యపరంగా తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే చైనాకు చెందిన జర్నలిస్ట్, బ్లాగర్ చేసిన సంచలన ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను చైనా ఏజెంట్లు హత్య చేసి.. ఆ ఉదంతాన్ని భారత్ వైపు మళ్లించి నింద వేయాలని చూసినట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామంతో భారత్‌కు పశ్చిమ దేశాలకు మధ్య తీవ్ర ఉద్రిక్తతలను రాజేసేందుకు డ్రాగన్ కుట్ర చేసిందని ఆరోపించారు.
అమెరికాలో నివసిస్తున్న చైనీస్ బ్లాగర్, జర్నలిస్ట్ జెన్నిఫర్ జెంగ్ తాజాగా భారత్, కెనడా సంబంధాలపై సంచలన ఆరోపణలు చేశారు. కెనడాలో ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ చీఫ్, హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సీసీసీ) హస్తం ఉందని జెన్నిఫర్ జెంగ్ ఆరోపించారు. ఇలా చేయడం వెనుక చైనా లక్ష్యం ఉందని పేర్కొన్నారు. హర్దీప్ సింగ్ హత్య నేరాన్ని భారత్ వైపు తోసి.. భారత్‌కు పశ్చిమ దేశాలకు మధ్య చిచ్చు పెట్టాలని చైనా ప్రయత్నించిందని చెప్పడం సంచలనంగా మారింది. ఈ మేరకు ట్విటర్‌లో ఓ వీడియో పోస్ట్ చేసిన జెన్నిఫర్ జెంగ్.. హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను సీసీసీ ఏజెంట్లు హత్య చేశారని ఆరోపించారు.
హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను కెనడాలో హత్య చేసేందుకు ముందు చైనాకు చెందిన ఒక ఉన్నత అధికారి అమెరికాలోని సీటెల్‌కు వచ్చారని పేర్కొన్నారు. భారత్, పశ్చిమ దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీయడమే లక్ష్యంగా సీటెల్‌లో ఒక రహస్య సమావేశం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కెనడాలో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సీసీసీ ఏజెంట్లదే బాధ్యత అని జెంగ్ స్పష్టం చేశారు. జూన్ 18 వ తేదీన చైనా ఏజెంట్లు ఆయుధాలతో నిజ్జర్‌ను వెంబడించారని జెంగ్ వెల్లడించారు. నిజ్జర్‌ను కాల్చి చంపిన తర్వాత సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి అతని కారు డాష్‌బోర్డ్‌లో ఉన్న కెమెరాను ధ్వంసం చేశారని ఆరోపించారు. నిజ్జర్ హత్యలో భారత్ పాత్ర ఉందని అనుమానాలు రేకెత్తించేందుకు దుండగులు ఘటనా స్థలంలో ఆధారాలు ఉండేలా చేసినట్లు తెలిపారు. కావాలనే ఆ నిందితులు భారతీయ యాసతో ఇంగ్లీషులో మాట్లాడారని కూడా జెంగ్ ఆరోపించారు. చైనా రహస్య ఏజెంట్లు భారత్‌ను దోషిగా చూపాలనే కుట్రలో భాగంగానే ఈ పని చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే చైనా జర్నలిస్ట్, బ్లాగర్ జెన్నిఫర్ జెంగ్ ఆరోపణలపై చైనా ఇప్పటివరకు స్పందించలేదు.
ఈ ఏడాది జూన్ 18 వ తేదీన కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలో ఉన్న సర్రేలోని ఓ గురుద్వారా పార్కింగ్ స్థలంలో నిజ్జర్‌ను కాల్చి చంపారు. కాగా జీ20 సమ్మిట్ తర్వాత కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని ఆ దేశ పార్లమెంటులో ఆరోపించడం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేస్తున్న ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది.