4 నెలల క్రితం ఒడిశాలో 3 రైళ్లు ఢీకొని జరిగిన ఘోర ప్రమాదం ఇప్పటికీ మనకు గుర్తు ఉంది. ఆ భీకర దృశ్యాలు, మృత దేహాలు, చెల్లాచెదురైన మృతదేహాలు.. ఇలాంటి భీతావహ దృశ్యాలు ఇంకా మన కళ్ల ముందే మెదులుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ దుర్ఘటనలో దాదాపు 300 మంది దుర్మరణం పాలయ్యారు. దాదాపు వెయ్యి మందికిపైగా గాయాల పాలయ్యారు. అయితే ఈ ఘటనలో చనిపోయి.. గుర్తు పట్టకుండా ఉన్న మృతదేహాలు ఇప్పటివరకు ఆస్పత్రుల్లో భద్రపరిచారు. అయినప్పటికీ వారి ఆచూకీ గుర్తించే ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో వాటికి సామూహికంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌లో ఉన్న 28 మంది మృత దేహాలకు త్వరలోనే ఒకేసారి అంత్యక్రియలు చేయాలని నిర్ణయించారు. వాటిని ఇప్పటివరకు ఎవరూ తీసుకుపోవడంతో సామూహిక అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది.
బాలేశ్వర్ జిల్లాలోని బహనాగా బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో మొత్తం 296 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 162 మృతదేహాలను భువనేశ్వర్ ఎయిమ్స్‌కు తరలించారు. అయితే అందులో 81 మంది మృతదేహాలను వారి బంధువులు తీసుకెళ్లారు. మిగిలిన 81 మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించిన అధికారులు.. అందులో 53 మృతదేహాలను అప్పగించారు. ఇంకా 28 మృతదేహాలు మాత్రం భువనేశ్వర్ ఎయిమ్స్‌లో ఉన్న మార్చురీలోనే ఉంచారు. అయితే ఈ మృతదేహాలు వలస కార్మికులవి కావొచ్చని అధికారులు భావిస్తున్నారు. వారంతా పశ్చిమ బెంగాల్‌లోని మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే నిబంధనల ప్రకారం.. అనాథ శవాలకు 30 రోజులు దాటితే అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉండగా.. ఈ కేసును సీబీఐ విచారిస్తున్న నేపథ్యంలో అది ఆలస్యం అయింది.
అయితే భువనేశ్వర్ ఎయిమ్స్‌లోని మార్చురీ ఫ్రీజర్లలో ఉంచిన మృత దేహాలను దహనం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని.. ఒడిశా అధికారులు సీబీఐకి లేఖ రాశారు. దీనిపై అభిప్రాయం తెలపాలని పేర్కొన్నారు. దీనికి బదులిచ్చిన సీబీఐ.. ఖుర్దా జిల్లా కలెక్టర్‌కు బదులు లేఖను రాసింది. ఈ అంత్యక్రియలకు సీబీఐ అధికారులు కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జూన్ 2 వ తేదీన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, ఓ గూడ్స్ రైలు, యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్ రైళ్లు పరస్పరం ఢీకొట్టడంతో పెను విషాదం చోటు చేసుకుంది. మూడు రైళ్లు ఢీకొన్న దుర్ఘటనలో బోగీల మధ్య చిక్కుకున్న మృతదేహాలు ఛిద్రమైన స్థితిలో ఉండటంతో గుర్తుపట్టలేకుండా మారాయి. దేశంలో జరిగిన అత్యంత ఘోరమైన రైల్వే ప్రమాదాల్లో ఇది ఒకటిగా నిలిచింది.