ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు రాకెట్ దాడులతో విరుచుకుపడటంతో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ క్రమంలోనే తాము యుద్ధంలో ఉన్నాం అంటూ ఏకంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రకటించడంతో భద్రతా బలగాలు కూడా రంగంలోకి దిగాయి. ఓ వైపు.. ఆకాశ మార్గంలో వైమానిక దాడులు చేస్తూనే సరిహద్దుల్లో రక్షణ కంచెను తొలగించి హమాస్ ఉగ్రవాదులు.. ఇజ్రాయెల్‌లోకి చొరబడి మారణ హోమాన్ని సృష్టిస్తున్నారు. దీంతో ఇజ్రాయెల్ మాజీ ప్రధాని నాఫ్తలీ బెన్నెట్ యుద్ధ రంగంలో అడుగు పెట్టారు. ఇజ్రాయెల్ రిజర్వ్ డ్యూటీలో ఉన్న నాఫ్తలీ బెన్నెట్.. మిలటరీ యూనిఫాం వేసుకున్నారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ సైనికులతో షేక్ హ్యాండ్ ఇస్తూ వారిని యుద్ధాన్ని సన్నద్ధం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శనివారం ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు 20 నిమిషాల్లో 5 వేల రాకెట్లు ప్రయోగించి మెరుపు దాడులు చేశారు. దీంతో హమాస్ మిలిటెంట్లను అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ కూడా ఎదురుదాడులకు దిగింది. గాజా స్ట్రిప్‌లో ఉన్న హమాస్ ఉగ్రవాద స్థావరాలపై ఆదివారం నుంచి భీకర యుద్ధం చేస్తోంది. దీంతో ఇరువైపులా దాడులు కొనసాగుతున్నాయి.
ఇక హమాస్ ఉగ్రవాదుల దాడులను ప్రపంచంలోని చాలా దేశాలు ఖండించగా.. అరబ్ దేశాలు మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్‌కు అండగా నిలిచిన అమెరికా.. ఆ దేశానికి యుద్ధ నౌకలు, విమానాలను పంపించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చిన ఆదేశాలతో విమాన వాహక నౌక యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్, యుద్ధ నౌకలను తూర్పు మధ్య ధరా ప్రాంతానికి పంపుతున్నట్లు అమెరికా డిఫెన్స్ విభాగం పెంటగాన్ వెల్లడించింది. ఈ నౌకలు, విమానాలు యుద్ధ రంగంలోకి దిగినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ ఆదివారం మధ్యాహ్నం తెలిపింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఆదివారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడినట్లు వైట్‌హౌస్ పేర్కొంది. ఇజ్రాయెల్ రక్షణ దళాలకు పూర్తి సహకారం అందిస్తామని.. భవిష్యత్‌లో మరింత సాయం చేస్తామని స్పష్టం చేసింది. ఇక ఇంతటి భారీ విధ్వంసానికి హమాస్ ఉగ్రవాదులు.. ఇజ్రాయెల్ సరిహద్దుల్లోని గాజా స్ట్రిప్ నుంచి ప్రణాళికలు రచిస్తుంటే.. ప్రపంచంలోనే అత్యంత పటిష్ఠమైన నిఘా, భద్రతా వ్యవస్థల్లో ఒకటైన ఇజ్రాయెల్ ఎందుకు పసిగట్టలేకపోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒక వేళ దాడుల గురించి ముందే సమాచారం వచ్చినా సరిగా స్పందించలేదా.. అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైమానిక దాడులకు అడ్డుకట్ట వేసే ఐరన్ డోమ్ సిస్టమ్‌కు ఏమైంది అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.