ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్. సర్వర్ సమస్యకు ప్రత్యామ్నాయంగా కీలక నిర్ణయం తీసుకన్నారు. సర్వర్ సమస్య పరిష్కారం అయ్యేంత వరకూ రేషన్ కార్డుదారులకు బియ్యం, గోధుమపిండి, పంచదార ఆఫ్‌లైన్‌లో సరఫరా చేయాలని పౌర సరఫరాల అధికారులు నిర్ణయించారు. ఈనెల 5 నుంచి సర్వర్ పనిచేయకపోవడంతో కార్డుదారులు గంటల కొద్దీ మొబైల్ వాహనాల దగ్గర పడిగాపులు ఉండాల్సి వచ్చింది. రేషన్ కార్డుదారుల నుంచి నిరసన వ్యక్తమవ్వడంతో ఎండీయూ ఆపరేటర్లు సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ పరిస్థితి చక్కదిద్దకపోతే సరకులు పంపిణీ చేయలేమనడంతో.. సర్వర్ పనిచేసేంత వరకు ఆఫ్‌లైన్ (వేలిముద్రలు అవసరం లేకుండా కార్డు నంబర్ నమోదు చేసుకుని)లో సరకులు పంపిణీ చేయాలని ఆదేశించారు. అయితే పోర్టబులిటీ కార్డులకు మాత్రం సరకులు ఇవ్వరు.. అంటే ఇతర ప్రాంతాల్లో కార్డులు కలిగిన వారికి మాత్రం ఇవ్వరు.
నాలుగు రోజులుగా సర్వర్లు పనిచేయక పోవడంతో రేషన్ ప్రక్రియ సజావుగా సాగటం లేదు. ఎండీయూ వాహనాల దగ్గర కార్డుదారుల వేలిముద్రలు పడక గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. లేకుంటే మళ్లీ వాహనం రాదని.. పనులు కూడా మానుకుని కార్డుదారులు వాహనాల వద్దే పడిగాపులు పడుతున్నారు. గతంలో ఎప్పుడూ ఇన్ని రోజుల పాటు సర్వర్లు పనిచేయకుండా ఉండలేదన్నారు. అమరావతి సర్వర్‌లో సమస్యల వల్లనే సమస్యలు వచ్చాయంటున్నారు. ఈ నెల ఒకటి నుంచి పంపిణీ ప్రారంభించగా నాలుగు రోజులు ప్రక్రియ సాఫీగానే సాగింది. సర్వర్‌లో సమస్య తలెత్తడంతో సరకులు ఎప్పుడొస్తాయో తెలియక లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రతిరోజు ఎండీయూ వాహనాలు గ్రామాలకు వచ్చినా వెనక్కు వెళుతున్నారు. రోజులో కనీసం 2 నుంచి 4 గంటల పాటు ఈ పరిస్థితి తలెత్తుతోంది. కొన్ని సందర్భాల్లో వేలిముద్రలు పడకపోవడం.. మరికొన్నిసార్లు యంత్రాలు మొరాయించడం వంటి సమస్యలు ఉన్నాయి.
సర్వర్ తరచూ మొరాయిస్తుండడంతో బియ్యం తీసుకునేందుకు ఒకసారి, పంచదార తదితరాల కోసం మరోసారి వేలిముద్రలు వేయాల్సిన పరిస్థితి. ఒక్కోసారి వేలిముద్ర వేసేందుకు ఎక్కువ సమయం పడుతుండటం.. సర్వర్ పనిచేయక పోవడంతో పంపిణీ ప్రక్రియ నత్త నడకన సాగుతోంది. బియ్యానికి ఒక వేలిముద్ర వేస్తే, పంచదార, పప్పులకు రెండోసారి బయోమెట్రిక్ లబ్ధిదారులు వేయడంతో ప్రతి లబ్ధిదారుల దగ్గర ఆలస్యం అవుతుందంటున్నారు. అందుకు రేషన్ పంపిణీ చేయలేకపోతున్నామని వాహనదారులుతో పాటు లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. ఉన్నతాధికారులు దృష్టిసారించి సర్వర్ పనిచేసేందుకు వేరే సిమ్‌ను ఏర్పాటు చేస్తారని రేషన్ లబ్ధిదారులు, వాహనదారులు కోరుతున్నారు. సాధారణంగా ప్రతి నెలా 15వ తేదీ వరకు పంపిణీ ఉంటుంది. అందుకు మరో ఐదు రోజులు మాత్రమే గడువు ఉండటంతో పలువురు ఆందోళన చెందుతున్నారు.