ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లకు సంబంధించి కీలక నిర్ణయాలను రాజస్థాన్ ఎన్నికల సంఘం వెలువరించింది. ఇప్పటికే రాజస్థాన్ ఎన్నికల తేదీని నవంబర్ 23 వ తేదీ నుంచి నవంబర్ 25 వ తేదీకి కేంద్ర ఎన్నికల సంఘం మార్చింది. అయితే ఈసారి రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో 8 విభాగాలకు చెందిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. అయితే తొలిసారి జర్నలిస్టులు కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
మొత్తం 8 డిపార్ట్‌మెంట్‌లలో పనిచేసేవారు ఈ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని రాజస్థాన్ చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ప్రవీణ్ గుప్తా తెలిపారు. డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది, అంబులెన్స్ వర్కర్లు, ఇంధన శాఖలో ఎలక్ట్రీషియన్లు, పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగంలో లైన్‌మెన్లు, పంప్ ఆపరేటర్లు, రాజస్థాన్ మిల్క్ కమిటీల్లో టర్నర్లు, రవాణా కార్పొరేషన్‌లో ఉద్యోగులు, డ్రైవర్లు, కండక్టర్లు, అగ్నిమాపక సిబ్బందితో పాటు మీడియా సిబ్బందికి ఈ ఏడాది నుంచి పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. అయితే ఇలా జర్నలిస్ట్‌లను కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ కేటగిరీలోకి చేర్చడం ఇదే మొదటిసారి అని స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఈ సదుపాయం ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, అధికారులు, ఆర్మీ, పారా మిలటరీ సిబ్బందికి మాత్రమే ఉండేదని వివరించారు.
ఇక ఇప్పటినుంచి ఎమర్జెన్సీ సర్వీసుల్లో పనిచేసే వారందరికీ పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పిస్తున్నట్టు రాజస్థాన్ ప్రధాన ఎన్నికల అధికారి ప్రవీణ్ గుప్తా స్పష్టం చేశారు. అయితే పోలింగ్ రోజున విధుల్లో ఉండే ఉద్యోగుల గురించి.. ఆరోజు ఓటు వేయడం సాధ్యం కాని వారి వివరాలను ఆయా విభాగాలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఆ విభాగాలు ఇచ్చిన లిస్ట్‌ల ఆధారంగా రిటర్నింగ్ అధికారి వారికి ఫారం 12 డి జారీ చేస్తారని చెప్పారు. వాటి ద్వారా వారికి ఫెసిలిటేషన్ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే వెసులుబాటు కల్పిస్తారని తెలిపారు. రాజస్థాన్‌లో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. నవంబర్ 25 న పోలింగ్ జరగనుంది. ఇక డిసెంబర్ 3 వ తేదీన ఐదు రాష్ట్రాలతోపాటే ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్నారు. ముందుగా నవంబర్ 23 వ తేదీన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్నట్లు షెడ్యూల్ విడుదల కాగా.. ఆ రోజు రాజస్థాన్‌లో 50 వేలకుపైగా పెళ్లిళ్లు ఉన్న నేపథ్యంలో రెండు రోజుల తర్వాత అంటే నవంబర్ 25 వ తేదీకి మార్చారు.