మీరు సీతారామం సినిమా చూశారా. అందులో హీరో హీరోయిన్ ప్రేమించుకుంటారు. పెళ్లి కూడా చేసుకోవాలి అని అనుకుంటారు. సైన్యంలో పనిచేసే హీరో.. యుద్ధం రావడంతో హీరోయిన్‌ను వదిలేసి వెళ్తాడు. అయితే శత్రు దేశంలో చిక్కుకుని బంధీగా అయిపోతాడు. అయితే తాజాగా జరుగుతున్న ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో కూడా సీతారామం సినిమాను తలపించేలా ఓ సంఘటన జరిగింది. ఇజ్రాయెల్ రిజర్వ్ ఫోర్స్‌లో పనిచేసే యువతీయువకులు ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే హమాస్ ఉగ్రవాదుల నుంచి మెరుపు దాడులు జరగడంతో ఇజ్రాయెల్ కూడా యుద్ధాన్ని ప్రకటించింది. దీంతో రిజర్వ్ ఫోర్స్‌ను సైన్యంలోకి రావాలని ఆదేశించింది. దీంతో ఆ ప్రేమ జంట సైన్యంలో చేరే ముందు పెళ్లి చేసుకుని వెళ్లారు.
అక్టోబర్ 8 వ తేదీన తెల్లవారుజామున గాజా స్ట్రిప్ నుంచి హమాస్ మిలిటెంట్లు.. ఇజ్రాయెల్ భూభాగంపై వేలాది రాకెట్లతో మెరుపు దాడులకు దిగారు. ఈ దాడులతో ఇజ్రాయెల్ కూడా రంగంలోకి దిగి వాటిని ప్రతిఘటించి.. ఎదురు దాడికి దిగింది. దీంతో అత్యవసర యుద్ధం చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ క్రమంలోనే హమాస్ ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు గాజా స్ట్రిప్‌పై యుద్ధం చేసేందుకు ఇజ్రాయెల్ అదనంగా 3 లక్షల రిజర్వ్ సైనికులను సైన్యంలో చేరాలని ఆదేశించింది. ఇందులో ఉరి మింట్జెర్, ఎలినోర్ యోసెఫిన్ అనే ఇద్దరు సైనికులు కూడా ఉన్నారు. అయితే వారు ఇజ్రాయెల్ రిజర్వ్ యూనిట్‌లలోకి వెళ్లేముందు హడావుడిగా ఆకస్మిక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో థాయ్‌లాండ్‌లో పర్యటిస్తుండగా.. వెంటనే ఇజ్రాయెల్ చేరుకుని.. పెళ్లి చేసుకున్నారు.
పెళ్లి గురించి తాము చాలా కలలు కన్నామని.. కానీ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని అస్సలు ఊహించలేదని ఆ యువ జంట పేర్కొన్నారు. తాము త్వరలోనే యుద్ధాన్ని ముగించుకుని.. ఇంటికి వచ్చి ఘనంగా పెళ్లి వేడుక జరుపుకుంటామని ఆశిస్తున్నట్లు తెలిపారు. తామిద్దరం చాలా మంచి స్నేహితులం అని.. ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నట్లు చెప్పారు. దీంతో సెంట్రల్ ఇజ్రాయెల్‌లోని షోహామ్‌లో స్థానిక సాంప్రదాయం ప్రకారం ఉరి మింట్జెర్, ఎలినోర్ యోసెఫిన్ పెళ్లి జరిగింది. ఇరువురి తల్లి దండ్రులు, కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. యుద్ధాన్ని విజయవంతంగా త్వరలోనే ముగించుకుని వచ్చి సంసార జీవితాన్ని సాగించాలని నెటిజన్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.