కాసరనేని సదాశివరావు శత జయంతి ఉత్సవాలకు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరోపకారం కోసం జీవితాంతం కట్టుబడిన వ్యక్తి సదాశివరావు అని చెప్పుకొచ్చారు. కాసరనేని మరణానంతరం జీవించి ఉన్నారంటే వారు బతికి ఉన్నప్పుడు చేసిన పనులే కారణమన్నారు. ఇప్పటికి లక్షలాది మంది గుండెల్లో సదాశివరావు నిలిచిపోయారని.. అరుదైన రాజకీయ నాయకుల్లో కాసరనేని ఒకరు అని కొనియాడారు. నీతి, నిజాయితీ, చిత్తశుద్ధితో పని చేసేవారు రాజకీయాల్లో ఉంటే దేశం బాగుపడుతుందని తెలిపారు. కాగా.. శతజయంతి ఉత్సవాల్లో భాగంగా పలు రంగాలలో ప్రముఖులకు సన్మానం జరిగింది. కాసరనేని శత జయంతి ప్రత్యేక సంచిక సదాస్మరామి పుస్తకం, ప్రత్యేక తపాలా బిల్లను వెంకయ్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మాజీ మంత్రులు వడ్డే శోభానాదీశ్వరావు, కామినేని శ్రీనివాసరావు, కేంద్ర కార్మిక సంక్షేమ బోర్డు ఛైర్మన్ వల్లూరి జయ ప్రకాష్ నారాయణ పాల్గొన్నారు.