తిరుపతి నగరంలోని ధనలక్ష్మినగర్ ఏటీఎం చోరీ కేసును ఛేదించి నిందితులని అరెస్ట్ చేసారు. ఈ సందర్భంగా ఎస్పీ పరమేశ్వర రెడ్డి మాట్లాడుతూ..దక్షిణాన ఏటీఎం చోరీలకు పాల్పడుతున్న హర్యానా గ్యాంగ్‌ను తొలిసారిగా అరెస్టు చేసినట్లు తెలిపారు. 8 మంది గ్యాంగ్‌లో 6 మందిని అరెస్ట్ చేశామని..మరో ఇద్దరు పరారీలో ఉన్నారన్నారు. కేవలం 15 నిమిషాల్లో ఈ మూఠా ఏటీఎంను కొల్లగొడుతోందన్నారు. ఏటీఎం మిషన్ కటింగ్‌కు గ్యాస్‌తో పాటు ఆక్సిజన్ కలిపి మండించడంలో ముఠా ఆరితేరిందన్నారు. నిందితుల విచారణలో విజయనగరం, చింతామణి, చిక్కమంగళూరు, తుమకూరు ఏటీఎం దొంగతనాలకు పాల్పడినట్లు తేలిందన్నారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటకలో గంజాయి కొనుగోలు చేసి హర్యానాలో ఎక్కవ రేటుకు అమ్ముకునే వారన్నారు. నిందితులు ఏటీఎం చోరీ సొమ్ముతో ఒక లారీని కొనుగోలు చేశారన్నారు. చోరీ సమయంలో వాడిన లారీ, కారుతో పాటు కొనుగోలు చేసిన లారీని సీజ్ చేశామన్నారు. అలాగే రెండు తుపాకులు,21 కేజీ గంజాయి, రెండు లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును చేధించిన చంద్రగిరి డీఎస్పీ డాక్టర్. యస్వంత్ టీంను ఎస్పీ అభినంచారు. జిల్లాలో చాలా ఏటీఎంల వద్ద కాపాలాదారులు లేరని... దానిపై బ్యాంకులకు, ఆర్బీఐకి లేఖ రాశామని ఎస్పీ పరమేశ్వరరెడ్డి వెల్లడించారు.