ఇజ్రాయేల్ దళాలు, హమాస్ మిలిటెంట్ల మధ్య జరుగుతోన్న పోరు తీవ్రం కావడంతో భారత్ అప్రమత్తమైంది. దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేసింది. శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చి ఆందోళనలు నిర్వహించే అవకాశం ఉందని భావించిన ఢిల్లీ పోలీసులు.. ముందస్తు చర్యలు చేపట్టారు. వీధుల్లో భారీగా పోలీసులను మోహరించారు. అలాగే, ఇజ్రాయేల్ ఎంబసీ, యూదుల మతపరమైన ప్రదేశాల వద్ద భద్రతను పెంచారు. ఇజ్రాయేల్-పాలస్తీనా సరిహద్దుల్లో పెరుగుతున్న హింసను దృష్టిలో ఉంచుకుని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీతో సహా అనేక దేశాలు అక్కడ యూదులు, పాలస్తీనా అనుకూల నిరసనల విషయంలో భద్రతను పెంచిన తర్వాత భారత్ ఈ చర్యలు చేపట్టడం గమనార్హం. ఇజ్రాయేల్‌పై హమాస్ రక్తపాత దాడి తరువాత.. ప్రజా శాంతి ప్రయోజనాల దృష్ట్యా పాలస్తీనా అనుకూల ప్రదర్శనలను ఫ్రాన్స్ గురువారం నిషేధించింది. దీనిపై విమర్శకులు మాత్రం.. ఇది వాక్ స్వేచ్ఛను ఉల్లంఘించడమేనని మండిపడుతున్నారు. హమాస్ ఆకస్మిక దాడిలో 1,300 మంది ఇజ్రాయేలీలు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ఆగ్రహంతో రగిలిపోయిన ఇజ్రాయేల్.. ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించింది. హమాస్ స్థావరాలున్న గాజా నగరంపై వైమానిక దాడులు, రాకెట్లతో విరుచుకుపపడుతోంది. ఇప్పటి వరకూ 1,500 మందికి పైగా హమాస్ మిలిటెంట్లు హతమైనట్టు ఇజ్రాయేల్ ప్రకటించింది.
ఇజ్రాయేల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు.. హమాస్ దాడి జరిగిన వెంటనే యుద్ధాన్ని ప్రకటించారు. గాజాను శిథిలంగా మారుస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశారు. యుద్ధం కారణంగా ఇజ్రాయేల్‌లో చిక్కుకుపోయిన భారతీయ పౌరుల తరలింపుకు కేంద్రం ఆపరేషన్ అజయ్ ప్రారంభించింది. ఇజ్రాయేల్ నుంచి తొలి విమానం శుక్రవారం ఉదయం న్యూఢిల్లీకి చేరుకుంది. ఆపరేషన్ అజయ్ కింద మొదటి విమానంలో 212 మందిని తీసుకొచ్చారు. యుద్ధ భూమి నుంచి బయటపడి క్షేమంగా స్వదేశానికి చేరుకోవడంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇజ్రాయెల్ నుంచి స్వదేశానికి చేరుకున్న భారత పౌరులకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్వాగతం పలికారు.