దేశంలో హిందూ ముస్లిం మతసామరస్యానికి ప్రతీకలా నిలిచిన మరో ఘటన ఇది. అనారోగ్యంతో బాధపడుతోన్న తన ముస్లిం స్నేహితుడు కోలుకోవాలని ఓ హిందూ యువకుడు పుణ్యక్షేత్రాలను దర్శించుకుని పూజలు చేశాడు. యువకుడి ప్రార్థనలు ఫలించి మిత్రుడు కోలుకోవడంతో అతడ్ని వెంటబెట్టుకుని హిందూ ఆలయాలకు వెళ్లి మొక్కులు చెల్లించుకున్నాడు. తిరుపతి, ధర్మస్థల మంజునాథ ఆలయాలను స్నేహితులు ఇద్దరూ కలిసి దర్శించుకున్నారు. మతసామరస్యం వెల్లివిరిసిన ఈ ఘటన కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో చోటుచేసుకుంది.
దావణగెరెకు చెందిన న్యాయవాది అనిస్ పాషాను కొద్ది రోజుల కిందట ఓ కేసు విషయంలో అరుణ్ కుమార్ అనే యువకుడు కలిశాడు. ఈ కేసులో అరుణ్ కుమార్ తరఫున అనిస్ కోర్టులో వాదించడంతో తీర్పు యువకుడికి అనుకూలంగా వచ్చింది. అప్పటి నుంచి అనిస్, అరుణ్ ప్రాణ స్నేహితులయ్యారు. ఈ క్రమంలో కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో అనిస్ గుండె సంబంధిత అనారోగ్యానికి గురయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న అరుణ్కుమార్..తల్లడిల్లిపోయాడు. తన స్నేహితుడు కోలుకుంటే తిరుపతి తిమ్మప్ప దేవాలయం, ధర్మస్థల మంజునాథ స్వామి ఆలయాలకు తనతో వస్తానని మొక్కుకున్నాడు. ధర్మస్థలలో తులాభారం సమర్పిస్తానని ముడుపు కట్టాడు. అరుణ్ ప్రార్థనలు ఫలించి, కోరుకున్నట్టే మిత్రుడు పాషాకు గుండె జబ్బు నయం అయింది. దీంతో అరుణ్ కుమార్ తన స్నేహితుడిని మొదటగా తిరుపతి తిమ్మప్ప దేవాలయానికి తీసుకెళ్లి పూజలు జరిపించాడు. అనంతరం దక్షిణ కన్నడ జిల్లాలోని ధర్మస్థల మంజునాథ స్వామి ఆలయానికి వెళ్లి అభిషేకం చేయించి.. బెల్లం, కొబ్బరికాయలు, బియ్యంతో తులాభారం సమర్పించారు.
‘మీ మతాన్ని ప్రేమించు, ఇతర మతాలను గౌరవించు అనేది ఇస్లాం సిద్ధాంతం. అంతేకాదు అనాథ పిల్లల ఎదుట మీ పిల్లలను హత్తుకోవద్దని ప్రవక్త ప్రవచించారు.. దాని ప్రకారం.. మా మతాలు, ఆచారాలు వేరైనా.. అరుణ్ కుమార్ విశ్వాసం దెబ్బతినకూడదనే ఉద్దేశంతో తనతో కలిసి హిందూ ఆలయానికి వెళ్లి అతడి మొక్కులను తీర్చాను.. ఇంతకుముందు ఓ కేసు విషయంలో అరుణ్ నా క్లైంట్. తర్వాత అతడు మా కుటుంబానికి సన్నిహితుడయ్యాడు.. న్యాయవాద వృత్తిలో భాగంగా చాలా మంది క్లైంట్లను కలిశాను.. కానీ అరుణ్ కుమార్ నాకు చాలా దగ్గరయ్యాడు. 2021లో కరోనా సమయంలో ఛాతిలో నొప్పి రావడంతో రక్తనాళానికి రెండు వైపులా స్టెంట్ వేశారు.. బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాను... ఈ క్రమంలో అరుణ్ నేను కోలుకోవాలని ప్రార్థనలు చేశాడు.. అందుకే ఇద్దరం కలిసి ధర్మస్థలానికి వెళ్లి మొక్కులు చెల్లించాం’ అని అనిస్ అన్నారు.