ఇజ్రాయెల్‌లో ప్రస్తుతం యుద్ధం భీకరంగా సాగుతోంది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న వారిని తీసుకెళ్లేందుకు అన్ని దేశాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత్ కూడా ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఆపరేషన్ అజయ్‌ను చేపట్టిన భారత్.. ఇందులో భాగంగానే 212 మందితో కూడిన మొదటి ఛార్టర్ ఫ్లైట్ ఢిల్లీకి చేరుకుంది. ఈ క్రమంలోనే స్వదేశానికి చేరుకున్న భారతీయులు సంతోషం వ్యక్తం చేశారు. యుద్ధాన్ని కళ్లారా చూసి.. ప్రాణ భయంతో వణికిపోతున్న తమను భారత అధికారులు స్వదేశానికి తీసుకురావడం పట్ల వారు ధన్యవాదాలు తెలిపారు.
ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయి సురక్షితంగా భారత్‌కు చేరుకున్న వారికి కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఢిల్లీ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధంతో అక్కడ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నుంచి తమను స్వదేశానికి తీసుకురావడం పట్ల వారు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్దం నేపథ్యంలో అక్టోబర్ 7 వ తేదీనే ఎయిర్ ఇండియా తమ విమాన రాకపోకలను రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే భారతీయులు ఇజ్రాయెల్‌లోనే చిక్కుకుపోయారు. ఆపరేషన్ అజయ్‌లో భాగంగా ప్రస్తుతం కేంద్రం సొంత ఖర్చులతో ప్రత్యేక విమానాలలో భారతీయులను స్వదేశానికి తీసుకువస్తోంది.
ఇజ్రాయెల్‌లో దాదాపు 18 వేల మంది భారతీయులు నివసిస్తున్నట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. యుద్ధం జరుగుతున్న ప్రాంతంలో చిక్కుకుపోయిన భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ‘ఆపరేషన్ అజయ్’పేరుతో ఇజ్రాయెల్‌లోని భారతీయుల తరలింపు ప్రక్రియను గురువారం భారత్ ప్రారంభించింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ‘ఆపరేషన్ అజయ్’ను ప్రారంభిస్తున్నట్లు బుధవారం ట్వీట్ చేశారు. భారతీయులు సురక్షితంగా దేశానికి తిరిగి రావడానికి ప్రత్యేక చార్టర్ విమానాలు, ఇతర ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. విదేశాల్లోని తమ పౌరుల భద్రతకు భారత్ పూర్తిగా కట్టుబడి ఉందని జై శంకర్ వెల్లడించారు.
ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంతో పశ్చిమాసియాలో రోజురోజుకూ ఉద్రిక్తత తీవ్రమవుతోంది. ఇప్పటికే గాజా స్ట్రిప్‌ను అష్ట దిగ్బంధం చేసిన ఇజ్రాయెల్.. హమాస్ ఉగ్రవాదులకు చుక్కలు చూపిస్తోంది. హమాస్ ఉగ్రవాదులు కూడా ఇజ్రాయెల్ సైన్యంపై రాకెట్లతో ఎదురుదాడికి దిగుతున్నారు. ఈ దాడిలో ఇరువైపులా 2800 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌లో 13 వందల మంది, గాజాలో 1355 మందికిపైగా బలయ్యారు. దీంతో ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న ప్రజలను తరలించేందుకు అన్ని దేశాలు ప్రత్యేక ఆపరేషన్లను ప్రారంభించాయి.