ఏపీలో చంద్రబాబు అరెస్ట్, ఆయన ఆరోగ్యంపై టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. రిమాండ్ లో ఉన్న చంద్రబాబు పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఆందోళనకరంగా ఉందని, ప్రధాని మోదీ వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. చంద్రబాబు స్కిన్ అలర్జీతో బాధపడుతున్నట్టు నివేదికలు వచ్చాయని, కానీ చంద్రబాబు ఆరోగ్యం దెబ్బతినేలా జైలు పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని కనకమేడల ఆరోపించారు. చంద్రబాబు ఇప్పటికే ఐదు కిలోల బరువు తగ్గారని, ఒక్కసారిగా అంత బరువు తగ్గడం కిడ్నీలపై దుష్ప్రభావం చూపే అవకాశం ఉందని వివరించారు. పైగా, చికిత్స పేరిట చంద్రబాబుకు స్టెరాయిడ్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసిందని వెల్లడించారు. చంద్రబాబుకు తక్షణ వైద్య సహాయం అవసరమని నివేదికలు చెబుతున్నాయని, అదే సమయంలో ప్రభుత్వ చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యంపై నెలకొన్న ఆందోళనల నేపథ్యంలోనే ఈ లేఖ రాస్తున్నట్టు కనకమేడల వివరించారు.