అక్టోబరు 11న జమ్మూ కశ్మీర్‌లో మరణించిన అగ్నివీర్ అమృతపాల్ సింగ్ అంత్యక్రియలను సైనిక లాంఛనాలతో నిర్వహించకపోవడం.. గార్డ్ ఆఫ్ హానర్ ఇవ్వకపోవడంపై ప్రతిపక్షాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. అయితే, స్వయంగా తుపాకీతో కాల్చుకున్న గాయం సింగ్ మరణానికి కారణం కాబట్టి ప్రస్తుత పాలసీకి అనుగుణంగా ఎటువంటి గార్డ్ ఆఫ్ హానర్ లేదా సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించలేదని సైన్యం ప్రకటించింది. దీనిపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా ఘాటుగా స్పందించారు. ఈ విషయంలో కేంద్రంతో తీవ్రంగా విబేధిస్తున్నామని ఈ మేరకు ట్విట్టర్‌లో స్పష్టం చేశారు.
‘అమృతపాల్ సింగ్ బలిదానంపై ఆర్మీ విధానం ఏమైనప్పటికీ..తమ ప్రభుత్వ విధానం అమరవీరునిగానే పరిగణిస్తుంది.. రాష్ట్ర ప్రభుత్వ విధానం ప్రకారం సైనికుడి కుటుంబానికి రూ. 1 కోటి అందజేస్తాం.. అమృతపాల్ సింగ్ దేశం కోసం ప్రాణాలిచ్చిన అమరవీరుడు’ అని ట్వీట్ చేశారు. పంజాబ్‌లో మాన్సా జిల్లాకు చెందిన అమృతపాల్ సింగ్.. అగ్నివీర్‌గా ఎంపికై జమ్మూ కశ్మీర్ రైఫిల్స్‌లో చేరాడు. పూంఛ్ సెక్టార్‌లో విధులు నిర్వర్తిస్తున్న అతడు దురదృష్టవశాత్తూ బుధవారం ప్రాణాలు కోల్పోయాడు. స్వస్థలానికి మృతదేహాన్ని సైన్యం తరలించగా.. శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు.
అయితే, దేశసేవ కోసం సైన్యంలో చేరి ప్రాణాలర్పించిన యువకుడికి కనీస గౌరవం కూడా ఇవ్వలేదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మాజీ కేంద్ర మంత్రి, శిరోమణి అకాలీ దళ్ నేత హరిసిమ్రత్ కౌర్ బాదల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గౌరవ వందనానికి అగ్నివీరుడు అర్హుడు కాకపోవడంతో తీవ్ర విచారమని, ఈ విషయంలో కేంద్ర రక్షణ మంత్రి జోక్యం చేసుకోవాలని ఆమె కోరారు. ప్రయివేట్ అంబులెన్స్‌లో మృతదేహాన్ని తరలించారని, అగ్నివీర్ కూడా సైనికుడేనని, మన సైనికులందరికీ గౌరవం ఇవ్వాలని ఆమె అన్నారు.
ఈ వివాదంపై స్పందించిన ఆర్మీ.. ‘అగ్నివీర్ అమృతపాల్ సింగ్ రాజౌరీ సెక్టార్‌లో సెంట్రీ డ్యూటీలో ఉండగా తుపాకీ గాయం కారణంగా మరణించారు.. మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి విచారణ కొనసాగుతోంది... సింగ్ మృతదేహాన్ని, ఒక జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్, నలుగురు ఇతర ర్యాంకు సిబ్బంది అగ్నివీర్ యూనిట్ అద్దెకు తీసుకున్న సివిల్ అంబులెన్స్‌లో తరలించారు.. అతనితో పాటు ఆర్మీ సిబ్బంది కూడా అంత్యక్రియలకు హాజరయ్యారు.. మరణానికి కారణం స్వీయ గాయం.. ప్రస్తుత పాలసీకి అనుగుణంగా గౌరవం లేదా సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపలేదు’ అని పేర్కొంది.
పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా ఆవేదన వ్యక్తం చేశారు. ‘అగ్నివీర్ పథకం కింద రిక్రూట్ అయిన ఈ సైనికుడిని ప్రైవేట్ అంబులెన్స్‌లో ఇంటికి తిరిగి పంపించి ఎటువంటి గౌరవం ఇవ్వకపోవడంతో మన దేశానికి విచారకరమైన రోజు. అగ్నివీరుడుగా ఉండటం అంటే వారి జీవితాలకు అంతగా విలువలేదా’ అని ప్రశ్నించారు. ‘మా కుమారుడికి గార్డ్ ఆఫ్ హానర్ ఇవ్వాలని మృతుడి కుటుంబం స్థానిక పంజాబ్ పోలీసులను అభ్యర్థించాల్సి వచ్చింది. అందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రారంభించిందా? మన అగ్నివీరులను మనం మిగతా సైనికుల కంటే భిన్నంగా ఇలాగే చూస్తామా? మన యువ అమరవీరుడి పట్ల అమానుషంగా ప్రవర్తించిన కేంద్ర ప్రభుత్వం వద్ద సమాధానాలు ఉన్నాయా? ఇది అవమానకరం’ అని మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa