దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అయోధ్య రామాలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి పండగ తర్వాత అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలను నిర్వహించేందుకు ఇప్పటికే శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే అసలు దేశవిదేశాల్లోని కోట్లాది మంది హిందూ భక్తులు ఎంతో కోరికతో ఎదురు చూస్తున్న అయోధ్య రాముడు ఎలా ఉంటాడోనన్న ఆసక్తి రేకెత్తుతోంది. ఈ క్రమంలోనే ఆ రాముడి విగ్రహాన్ని చెక్కిన శిల్పి తాజాగా స్పందించారు. బాలుడి రూపంలో అయోధ్య రాముడిని చెక్కినట్లు స్పష్టం చేశారు.
అయోధ్యలో నిర్మిస్తున్న భవ్య రామ మందిర నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఇక ఆలయ గర్భగుడిలో ప్రతిష్ఠించే రాముడి విగ్రహం కూడా దాదాపుగా సిద్ధమైంది. విగ్రహం పనులు 90 శాతం పూర్తయినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. ఇక రాముడి విగ్రహం అక్టోబర్ 30 వ తేదీ నాటికి పూర్తవుతుందని ప్రముఖ శిల్పి విపిన్ భదౌరియా తాజాగా తెలిపారు. అక్టోబర్ 30 వ తేదీ నాటికి రాముడి విగ్రహాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు చూసేందుకు సిద్ధం చేస్తామని విపిన్ భదౌరియా పేర్కొన్నారు.
ఈ సందర్భంగానే అయోధ్య రాముడిని బాలుడి రూపంలో చెక్కినట్లు స్పష్టం చేశారు. అయితే అయోధ్య రామాలయంలో ప్రతిష్ఠించనున్న రాముడి విగ్రహం కోసం మొత్తంగా 3 రాముడి విగ్రహాలను తయారు చేయిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ 3 రాముడి విగ్రహాలను వేర్వేరు శిల్పులు చెక్కుతున్నారని పేర్కొన్నారు. ఈ 3 విగ్రహాల్లో అత్యంత సుందరంగా కనిపించే దాన్ని ఎంపిక చేసి.. అయోధ్య రామ మందిరంలోని గర్భ గుడిలో ప్రతిష్ఠాపన చేస్తారని వెల్లడించారు. అయోధ్య రామాలయంలో ఉంచే రాముడి విగ్రహం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని విపిన్ భదౌరియా స్పష్టం చేశారు.
భక్తులు ఊహించిన దాని కన్నా అయోధ్య రాముడు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాడని విపిన్ భదౌరియా వెల్లడించారు. రాముడి విగ్రహాన్ని తీర్చిదిద్దడం కోసం చాలా కష్టపడినట్లు చెప్పారు. 51 అంగుళాల ఎత్తుతో బాలుడి రూపంలో రాముడి విగ్రహం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం విగ్రహం పనులు 90 శాతం పూర్తయ్యాయని పేర్కొన్నారు. బాలుడి రూపంలో ఉండే రాముడు ధనస్సు, విల్లు ధరించి.. కమలంపై కూర్చొని ఉంటాడని చెప్పారు. విగ్రహానికి తుది మెరుగులు దిద్దుతున్నామని.. అక్టోబర్ 30 వ తేదీ నాటికి రాముడి విగ్రహం పూర్తవుతుందని విపిన్ భదౌరియా వెల్లడించారు.
ఇక అయోధ్య రామ మందిర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం కోసం ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22 వ తేదీన అయోధ్య రామాలయంలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. అయితే ఇప్పటికే ఈ కార్యక్రమానికి ఆహ్వానించే వారి పేర్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీని కూడా శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానించింది. జనవరి 15 నుంచి 24 వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. ఆలయం గ్రౌండ్ ఫ్లోర్ పనులు 98 శాతం పూర్తి కాగా.. తొలి అంతస్తు పనులు 60 శాతం వరకు పూర్తయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa