ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మధ్యప్రదేశ్ సీఎం ప్రత్యర్థిగా రామానంద సాగర్ ‘రామాయణం’ నటుడు

national |  Suryaa Desk  | Published : Sun, Oct 15, 2023, 10:31 PM

మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ ఆదివారం ప్రకటించింది. తెలంగాణలో మొత్తం 119 స్థానాలకుగానూ 55.. మధ్యప్రదేశ్‌లో 230 స్థానాలకుగానూ 144, ఛత్తీస్‌గఢ్‌లో 90 నియోజకవర్గాలకుగానూ 30 స్థానాలకు అభ్యర్థులను నిర్ణయించింది. మధ్యప్రదేశ్ విషయానికి వస్తే సీఎం శివరాజ్ సింగ్ చౌహన్‌ ప్రత్యర్థిగా ప్రముఖ నటుడు, రామానంద్ సాగర్ రామాయణంలో హనుమాన్ పాత్రధాని విక్రమ్ మస్టల్‌ను దింపింది. బుధ్ని స్థానంలో బీజేపీ అభ్యర్థి, సీఎం చౌహన్‌తో విక్రమ్ మస్టల్ తలపడనున్నారు. మాజీ ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు కమల్ నాథ్‌కు ఛిద్వారా.. మాజీ సీఎం దిగ్విజయ్ తనయుడు, మాజీ మంత్రి జయవర్దన్ సింగ్‌కు రాఘిఘాట్ సీట్లను కేటాయించింది. అలాగే, రాజ్యసభ మాజీ సభ్యురాలు, కేంద్ర మాజీ మంత్రి విజయ్ లక్ష్మీ సాధోకు మహేశ్వర్ (ఎస్సీ), మరో మాజీ మంత్రి జీతు పట్వారీకి రౌ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపుతోంది.


మొత్తం 144 మందితో తొలి జాబితాను ప్రకటించగా.. వీరిలో 47 మంది జనరల్ కేటగిరీ.. 39 మంది ఓబీసీ, 30 మంది ఎస్టీ, 22 మంది ఎస్సీ, 19 మంది మహిళలు, ఒక ముస్లిం ఉన్నారు. అలాగే, 65 మంది అభ్యర్థులు 50 ఏళ్లలోపువాళ్లే కావడం గమనార్హం. ఇక, బీజేపీ పలు విడతల్లో 136 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీకి నవంబరు 17న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరు 3న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు. అధికారం నిలబెట్టుకోవాలని బీజేపీ.. భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని కాంగ్రెస్ భావిస్తున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినా.. 14 నెలలకే కమల్ నాథ్ సర్కారు కూలిపోయింది. యువనేత జ్యోతిరాదిత్య సింథియా తిరుగుబాటుచేసి.. తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరిపోయారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి.. మళ్లీ బీజేపీ అధికారాన్ని చేపట్టింది. ఈ నేపథ్యలో ఈసారి బీజేపీకి ఆ అవకాశం ఇవ్వబోమని, అత్యధిక మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామనే విశ్వాసంతో కాంగ్రెస్ ఉంది. అందుకు అనుగుణంగా కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. 144 మందితో తొలి జాబితాను ప్రకటించగా.. వీరిలో 69 మంది సిట్టింగులు ఉన్నారు.


అటు ఛత్తీస్‌గఢ్‌లోనూ వరుసగా రెండోసారి తమదే అధికారం అని కాంగ్రెస్ ఢంకా బజాయిస్తోంది. 90 స్థానాలున్న ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకంగా 68 సీట్లలో గెలుపొంది, అద్భుత విజయాన్ని అందుకుంది. ఈసారి కూడా అక్కడ బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోరు జరగనుంది. 30 మందితో తొలి జాబితా ప్రకటించగా.. వీరిలో కనీసం నలుగురు బీజేపీ మాజీ నేతలు ఉన్నారు. దతియా నుంచి అవదేశ్ నాయక్, ముంగోలి నుంచి యాదవేంద్ర సింగ్, కటాగ్ని నుంచి మాజీ ఎంపీ బోధ్ సింగ్ భగత్, సుర్ఖీ నుంచి నీరజ్ శర్మ ఉన్నారు. ముగ్గురు సిట్టింగుల సహా మాజీ స్పీకర్ ఎన్పీ ప్రజాపతికి టిక్కెట్ నిరాకరించింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa