గ్రామస్థాయిలో పూర్తిస్థాయిలో రక్తహీనతను నివారించాలంటే పౌష్టికాహారం ఇచ్చే బాధ్యతను మహిళా, శిశుసంక్షేమ శాఖ చేపట్టాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ఈ విషయంలో వైద్య ఆరోగ్యశాఖ, మహిళా శిశుసంక్షేమ శాఖ మధ్య సమన్వయం ఉండాలన్నారు. దీనివల్ల గ్రామస్థాయిలో పూర్తిస్థాయిలో రక్తహీనతను నివారించగలుగుతామన్నారు. ఇచ్చిన పౌష్టికాహారాన్ని వారు తీసుకుంటున్నారా? లేదా? రక్తహీనత సమస్య తగ్గుతుందా? లేదా? అన్నదానిపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖపై సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. మహిళాభివృద్ధి, శిశుసంక్షేమశాఖలో వివిధ కార్యక్రమాల అమలు తీరును అధికారులు సీఎంకు వివరించారు.