ఓ హత్య కేసు నుంచి తప్పించుకోడానికి చనిపోయినట్టు కట్టుకథ అల్లిన నౌకాదళ మాజీ ఉద్యోగి.. 20 ఏళ్ల తర్వాత అడ్డంగా దొరికిపోయాడు. పేరు మార్చుకుని, మరో ప్రాంతంలో కుటుంబంతో కలిసి ఉంటున్న అతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 20 ఏళ్ల కిందట ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న నేవీ మాజీ ఉద్యోగి బాలేశ్ కుమార్ అలియాస్ అమన్‌సింగ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. హరియాణాకు చెందిన బాలేశ్ కుమార్.. 8వ తరగతి వరకూ చదువుకున్నాడు. 1981లో నేవీలో ఉద్యోగిగా చేరిన అతడు.. 1996లో పదవీవిరమణ చేశాడు.
అనంతరం ఢిల్లీ నజఫ్‌గఢ్‌లోని బవానా ప్రాంతంలో కుటుంబంతో కలిసి ఉంటూ.. ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో 2004లో తన బంధువు రాజేశ్ అలియాస్ కుశీరామ్‌తో డబ్బుల విషయమై జరిగిన గొడవలో అతడ్ని హత్య చేశాడు. అయితే, రాజేశ్ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న బాలేశ్.. పథకం ప్రకారం హత్యచేశాడనే ఆరోపణలు ఉన్నాయి. కుశీరామ్ హత్యపై కేసు నమోదుచేసిన పోలీసులు.. బాలేశ్ సోదరుడు సుందర్‌లాల్‌ను అరెస్టుచేశారు. ప్రధాని నిందితుడు మాత్రం పోలీసుల కళ్లుగప్పి ఓ ట్రక్కులో రాజస్థాన్ పారిపోయాడు.
జోధ్‌పూర్‌లో ట్రక్కుకు నిప్పంటించి, తనవద్ద పనిచేసే బిహార్‌కు చెందిన ఇద్దరు కూలీలు మనోజ్, ముకేశ్‌లను సజీవ దహనం చేశాడు. అందులో తన మృతదేహం ఉన్నట్లు రాజస్థాన్ పోలీసులు నమ్మేలా చేశాడు. దీంతో ప్రధాన నిందితుడు చనిపోయాడని పేర్కొంటూ ట్రక్కు దహనం కేసును రాజస్థాన్ పోలీసులు మూసివేశారు. అనంతరం అక్కడ నుంచి పంజాబ్‌కు పారిపోయిన బాలేశ్.. తన పేరును అమన్‌సింగ్‌గా మార్చుకున్నాడు. నకిలీ పత్రాలు సృష్టించి ఢిల్లీకి చేరుకుని.. మరో ప్రాంతంలో కుటుంబంతో మకాం పెట్టాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించాడు.
ఇటీవలే బాలేశ్ గురించి పోలీసులకు సమాచారం అందడంతో నిందితుడిని అరెస్టుచేశారు. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ సీనియర్ ఆఫీసర్ రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. అనుమానాలను ధ్రువీకరించిన తర్వాత దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో ఆశ్చర్యకరమైన వివరాలు తెరపైకి వచ్చాయి. 2004లో బాలేశ్, అతడి సోదరుడు సుందర్ లాల్, రాజేశ్ కలిసి మద్యం సేవిస్తుండగా.. వాగ్వాదం జరిగిందని తెలిపారు. మద్యం మత్తులో ఉన్న రాజేశ్.. తన భార్యతో వివాహేతర సంబంధం గురించి నిలదీశాడు. దీంతో సోదరులిద్దరూ అతడ్ని రాజేశ్‌ను హత్యచేశారని యాదవ్ వివరించారు. ట్రక్కు ప్రమాదంలో చనిపోయినట్టు నమ్మించడంతో నిందితుడు భార్యకు నేవీ పెన్షన్, బీమా పరిహారం అందింది. అలాగే, ట్రక్కుకు సంబంధించిన ఇన్సూరెన్స్ కూడా అతడి భార్యకే చేరింది. గత గుర్తింపు, నేరాలు అదృష్టం కలిసొచ్చినన్ని రోజులు బయటపడలేదు. అతడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. ట్రక్కు దహనం కేసును మళ్లీ తెరవాలని రాజస్థాన్ పోలీసులను కోరారు.