ధర్మాసనంపై కూర్చున్న న్యాయమూర్తులు దేవతలు కారని, లాయర్లు, కక్షిదారులు వారి ముందు చేతులు కట్టుకొని ఒదిగి ఉండాల్సిన అవసరం లేదని కేరళ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ కున్హికృష్ణన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అలప్పూజకు చెందిన రమ్లా కబీర్ అనే ఓ మహిళ.. తన ఇంటి దగ్గర ఉన్న ప్రార్థనా మందిరం మైక్ వల్ల ఇబ్బంది పడుతున్నట్లు 2019లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఆమె విజ్ఞప్తిని ఎస్ఐ నిర్లక్ష్యం చేయడంతో నేరుగా ఆమె నేరుగా జిల్లా ఎస్పీని కలిశారు. తన ఫిర్యాదును ఎస్ఐ పట్టించుకోలేదని ఆరోపించారు.
తనపై ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఆమెపై కక్ష పెంచుకున్న సదరు ఎస్ఐ.. ఫోన్‌లో దుర్బాషలాడి ఆమెపైనే తప్పుడు కేసు పెట్టారు. దీంతో తనపై తప్పుడు కేసు పెట్టినఆ పోలీస్ అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. తన కేసును పరిశీలించాలంటూ ఆ మహిళ చేతులు జోడించి కన్నీళ్లతో అర్థించారు. ఈ సమయంలో న్యాయమూర్తి ఆమె ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తులు దేవుళ్లు కారని.. న్యాయవాదులు, కక్షిదారులు వారి ముందు చేతులు కట్టుకొని ఒదిగి ఉండాల్సిన పని లేదని స్పష్టం చేశారు. న్యాయానికి కోర్టులు దేవాలయాలైనా.. న్యాయమూర్తులు మాత్రం దేవుళ్లు కాదని వ్యాఖ్యానించారు.
‘అన్నింటిలో ముఖ్యమైంది న్యాయస్థానం ముందు ఏ న్యాయవాది లేదా కక్షిదారులు తమ కేసును ముకుళిత హస్తాలతో వాదించాల్సిన అవసరం లేదు ఎందుకంటే న్యాయస్థానం ముందు కేసును వాదించడం వారి రాజ్యాంగ హక్కు.. న్యాయస్థానాలు న్యాయానికి దేవాలయాలు.. కానీ, ఇక్కడ కూర్చున్న న్యాయమూర్తులు దేవుళ్లు కాదు.. వాళ్లు రాజ్యాంగ విధులు, బాధ్యతలు నిర్వర్తిస్తారు.. అయితే కేసును వాదించేటప్పుడు న్యాయవాదులు, కక్షిదారులు కోర్టు నియమాలను పాటించాలి’ అని జస్టిస్ కున్హికృష్ణన్ అన్నారు. అనంతరం మహిళపై పెట్టిన తప్పుడు కేసును రద్దుచేసిన న్యాయమూర్తి.. సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌పై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.