బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు.. సమాజానికి బ్యాక్ బోన్ క్లాస్ అని నిండు మనసుతో నమ్మిన ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి. దానిని మనసా, వాచా, కర్మణా ఆచరిస్తున్నారు కూడా. రజక, నాయీ బ్రాహ్మణ, టైలర్ల జీవితాల్లో మార్పు రావాలని, వారు మిగతా ప్రపంచంతో పోటీపడి ఎదగాలన్న సంకల్పంతో జగనన్న చేదోడు పథకాన్ని చేపట్టారు. ఈ పథకానికి అర్హులైన ప్రతి లబ్ధిదారుకు ఏడాదికి రూ.10 వేల సాయం అందిస్తున్నారు. వరుసగా నాలుగో ఏడాది జగనన్న చేదోడు సాయం అమలుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ గురువారం శ్రీకారం చుడుతున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వీవర్స్ కాలనీ వైడబ్ల్యూసీఎస్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో ఈ పథకం లబ్దిదారులకు సీఎం వైయస్ జగన్ బటన్ నొక్కి నిధులు విడుదల చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,25,020 మంది అర్హులైన రజక, నాయీ బ్రాహ్మణ, టైలర్ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు రూ. 325.02 కోట్ల ఆర్థిక సాయాన్ని వారి ఖాతాల్లో జమ చేయనున్నారు.