కృష్ణా జిల్లా కంకిపాడులో గోల్డ్‌లోన్ ఫైనాన్స్ కంపెనీ బ్రాంచిలో మహిళా ఉద్యోగి చేతివాటం ప్రదర్శించారు. ఆ బ్రాంచిలో వెంకట పావని ఆభరణాలు తాకట్టు పెట్టుకుని.. వాటిని జాగ్రత్త చేసే విభాగంలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి పనిచేస్తోంది. ఆమె కంకిపాడు బ్రాంచిలో 951 మంది ఖాతాదారులకు చెందిన 10.660 కిలోల బంగారాన్ని పావని సోమవారం రాత్రి మరో వ్యక్తితో కలిసి దొంగిలించింది.. ఆ తర్వాత ఆమె పారిపోయింది. మహిళా ఉద్యోగి దొంగిలించిన 10.660 కిలోల బంగారం విలువ సుమారు రూ.6 కోట్ల వరకు ఉంటుందని తేల్చారు. దీనిపై కంపెనీ ఉద్యోగులు కంకిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్రాంచిలో సీసీ కెమెరాలు రెండు నెలలుగా పని చేయడం లేదని పోలీసులు గుర్తించారు. పావని, మరో వ్యక్తి కలిసి బ్యాగుతో కారులో వెళ్లినట్లుగా స్థానిక లాకు రోడ్డులోని సీసీ కెమెరా ఫుటేజీలో ఉంది. పావనికి సహకరించిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అలాగే కంపెనీ బ్రాంచిలోని డాక్యుమెంట్లను తనిఖీ చేశారు.
పావని సోమవారం విధులు ముగించుకుని వెళ్లిందట.. ఆమె మంగళవారం విధులకు హాజరుకాలేదు. ఈలోపు కొందరు ఖాతాదారులు తాము తనఖా పెట్టిన బంగారు ఆభరణాలు విడిపించుకునేందుకు మణప్పురం బ్రాంచ్‌కు వచ్చారు. వారు ఇచ్చిన రశీదుల ప్రకారం చూడగా.. బ్రాంచ్‌లో ఆభరణాలు కనిపించలేదు. దీంతో సిబ్బంది తమ సంస్థ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. కంకిపాడు బ్రాంచిలోని రికార్డులను పూర్తి స్థాయిలో పరిశీలించిన అనంతరం సంస్థ ఉన్నతాధికారులు పోలీసులకు సమాచారం అందించారు. కంకిపాడు బ్రాంచ్‌లో పది కిలోలకు పైగా బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు తెలియడంతో తనఖా పెట్టి రుణాలు తీసుకున్న ఖాతాదారుల్లో ఆందోళన మొదలైంది. నమ్మకంగా పని చేస్తున్న సిబ్బందే బంగారం చోరీ చేశారని తెలిసి అవాక్కయ్యారు. అంతేకాదు ఆ బ్రాంచిలో రెండు నెలలుగా సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తెలిసినా ఎంందుకు పట్టించుకోలేదని విమర్శలు వస్తున్నాయి.సీసీ ఫుటేజ్‌లో కారు నంబరు ఆధారంగా దావులూరు టోల్‌గేట్ దగ్గర వివరాలు సేకరించారు.పావని కోసం పోలీసులు గాలిస్తుండగా.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.