విశాఖ వేదికగా పాలన, సీఎంవో ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో లింగమనేని శివరామ్‌ప్రసాద్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందు కేసులు పెండింగ్‌లో ఉన్నంతవరకూ రుషికొండపై నిర్మాణాలు, ఇతర అనుబంధ కార్యకలాపాలు జరగకుండా.. నిలువరించాలని కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. రుషికొండపై నిర్మించిన భవనాల్లో అక్టోబర్ 24న ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 11న ఈ జీవో జారీ చేసిందన్నారు.
చట్టవిరుద్ధమైన ఆ ఉత్తర్వుల అమలును నిలిపివేయాలని లింగమనేని కోరారు. లేని పక్షంలో హైకోర్టు, ట్రైబ్యునల్ ముందున్న కేసులు నిరర్ధకంగా మారి భవిష్యత్తు తరాలకు తీరని నష్టం జరుగుతుందన్నారు. సముద్రతీరానికి ఆనుకొని సున్నితమైన సీఆర్‌జడ్‌లో ఉన్న రుషికొండపై చేపట్టిన నిర్మాణాల న్యాయబద్ధతపై దాఖలైన కేసు ఏపీ హైకోర్టులో ఉందన్నారు. సీఆర్‌జడ్ రాజ్యాంగబద్ధతపై దాఖలైన కేసు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌లోనూ పెండింగ్‌లో ఉన్నాయన్నారు. రుషికొండపై పర్యాటకశాఖ రిసార్టుల నిర్మాణానికి అనుమతి తీసుకొని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయడం కోర్టు ధిక్కరణే అన్నారు. సుప్రీంకోర్టు తక్షణం జోక్యం చేసుకొని ఇక్కడ తదుపరి నిర్మాణాలు. దాని అనుబంధ కార్యకలాపాలేవీ జరగకుండా ఉత్తర్వులివ్వాలని విజ్ఞప్తి చేశారు.
కోస్టల్ రెగ్యులేటరీ జోన్‌పై ఎన్‌జీటీలో విచారణ జరుగుతోందని.. అయినా కోస్టల్ రెగ్యులేటరీ జోన్ మార్గదర్శకాలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని పేర్కొన్నారు. గంతలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా ఉల్లంఘించారని.. రుషికొండలో సీఎం క్యాంప్ ఆఫీస్ ఏర్పాటుకు సంబంధించిన జీవోను రద్దు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలను వెంటనే నిలువరించాలని పిటిషనర్ సుప్రీంకోర్టును కోరారు. రుషికొండపై రిసార్ట్ నిర్మాణంపై దాఖలైన కేసులు పరిష్కారం అయ్యే వరకూ... రుషికొండపై నిర్మాణాలు జరగకుండా ఉత్తర్వులు ఇవ్వాలని శివరామ్ ప్రసాద్ కోర్టును కోరారు. ఈ కేసుకు సంబందించి గతంలో రుషికొండ నిర్మాణాలపై సుప్రీం ఉత్తర్వుల కాపీ జతచేసినట్లు కోర్టుకు తెలిపారు.