టీడీపీ సీనియర్ నేతకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. జగజ్జనని చిట్‌ఫండ్ ఎండీ ఆదిరెడ్డి అప్పారావు బెయిల్ రద్దు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కొట్టేసింది. ఏపీ సీఐడీ చిట్‌ఫండ్‌లో అవకతవకలు జరిగాయంటూ ఆదిరెడ్డి అప్పారావును ఏప్రిల్‌లో అరెస్టు చేశారు. ఆయన వెంటనే హైకోర్టును ఆశ్రయించగా బెయిల్ మంజూరైంది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ రాజేష్ బిందల్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.
నిందితుడు సీఐడీ విచారణకు సహకరించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి కోర్టుకు తెలియజేశారు. దీంతో విచారణకు సహకరించాలని.. లేకుంటే బెయిల్ రద్దు చేస్తామని ధర్మాసనం పేర్కొంది. విచారణకు సహకరిస్తారని అప్పారావు తరఫున సుప్రీంకు సిద్ధార్థ లూథ్రా హామీ ఇచ్చారు. అనంతరం అప్పారావు బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేసింది. కోర్టు నిర్ణయంతో అప్పారావుకు ఊరట లభించగా.. ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది.
ఆదిరెడ్డి అప్పారావు కుటుంబం రాజమహేంద్రవరంలో జగత్‌జనని చిట్స్ నిర్వహిస్తోంది. అయితే జగత్ జనని చిట్స్‌కు సంబంధించి సీఐడీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆ తర్వాత ఈ కేసులో ఆదిరెడ్డి అప్పారావుతో పాటూ ఆయన కుమారుడు వాసులను సీఐడీ అరెస్ట్ చేసింది. ఈ చిట్స్ కంపెనీ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే జగజ్జనని చిట్‌ఫండ్‌పై సీఐడీకి, కాకినాడ అసిస్టెంట్ రిజిస్ట్రార్‌కు ఫిర్యాదులు వచ్చాయట. నకిలీ ఖాతాలతో మోసాలు.. చిట్స్ చెల్లింపుల్లోనూ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు 1982 చిట్‌ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడినట్లు అభియోగాలతో వీరిని సీఐడీ అరెస్ట్ చేసింది.