కేశ సంరక్షణ ఉత్పత్తుల వల్ల అండాశయ, గర్భాశయ కేన్సర్ సహా ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోపిస్తూ అమెరికా, కెనడాలోని పలువురు దావా వేసిన కంపెనీలలో తమ అనుబంధ సంస్థలు కూడా ఉన్నాయని డాబర్ ఇండియా బుధవారం ప్రకటించింది. ‘ప్రస్తుతం ఈ వ్యాజ్యలకు సంబంధించిన కేసులు.. ఆరంభ ఆవిష్కరణ దశలలో ఉన్నాయి’ అని పేర్కొంది. అంతేకాదు, ఈ ఆరోపణలు నిరాధారమైన, అసంపూర్ణ అధ్యయనం ఆధారంగా చేసేనవేనని ఆ సంస్థ తెలిపింది. నమస్తే ల్యాబొరేటరీస్, డెర్మోవివా స్కిన్ ఎస్సెన్షియల్స్, డాబర్ ఇంటర్నేషనల్‌తో సహా పలు కంపెనీలపై దాదాపు 5,400 కేసులకు సంబంధించిన వ్యాజ్యాలన్నీ ఇల్లినాయిస్‌లోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో ఉన్నాయని డాబర్ ఇండియా వెల్లడించింది. ఈ ఆరోపణలను ఆయా యూనిట్లు తిరస్కరించాయని, తమ తరఫున లాయర్‌ను కూడా నియమించాయని చెప్పింది.
వాటికా షాంపూ, హోనిటస్ దగ్గు సిరప్ బ్రాండ్‌లను విక్రయించే డాబర్ ఇండియా.. ఈ దశలో సెటిల్‌మెంట్ లేదా తీర్పు ఫలితాల వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులను నిర్ణయించలేమని వ్యాఖ్యానించింది. అయితే సమీప భవిష్యత్తులో భద్రత ఖర్చులు పెరుగుతాయని అంచనా వేస్తోంది. కాగా, దీనిపై అదనపు వివరాల కోసం సంప్రదించగా.. కంపెనీ వెంటనే స్పందించలేదు. కాగా, ఇటీవల డాబర్ తేనెలో కేన్సర్ కారకాలు ఉన్నాయంటూ వచ్చిన వార్తలు వినియోగదారుల్లో అలజడి రేపిన విషయం తెలిసిందే. సంఘటిత తేనె మార్కెట్లో డాబర్ కంపెనీకి ఎక్కువ వాటా కలిగి ఉంది. డాబర్ తేనెలో కార్సినోజెనిక్ మెటీరియల్స్ ఉన్నాయంటూ వచ్చిన వార్తలను డాబర్ ఇండియా ఖండించింది.
మరోవైపు, మంగళవారం మేజర్ వడ్డీ, పెనాల్టీతో సహా రూ. 320.60 కోట్ల జీఎస్టీ బకాయిలు చెల్లించాలని డాబర్ ఇండియాకు ఐటీ నోటీసులు అందాయి. దీనిపై కూడా స్పందించిన ఆ సంస్థ.. సంబంధిత అధికారుల ముందు నోటీసును సవాలు చేస్తామని తెలిపింది. ‘CGST చట్టం, 2017లోని సెక్షన్ 74(5) ప్రకారం చెల్లించాల్సిన పన్ను గురించి కంపెనీకి సమాచారం అందింది.. దీనిలో GST షార్ట్ పేమెంట్ / చెల్లించని మొత్తం రూ. 320.60 కోట్లతో పాటు వడ్డీ, జరిమానా చెల్లించాలని సూచించారు. విఫలమైతే షోకాజ్ నోటీసు జారీ చేస్తామని హెచ్చరించారు’ అని డాబర్ కంపెనీ పేర్కొంది.