రాజమహేంద్రవరం జైలులో నా భద్రతపై అనేక అనుమానాలు ఉన్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడ ఏసీబీ కోర్టుకు విన్నవించారు. గురువారం రిమాండ్ గడువును నవంబరు 1 వరకు పొడిగించిన తర్వాత న్యాయాధికారి హిమబిందు చంద్రబాబుతో కొద్దిసేపు మాట్లాడారు. ఆరోగ్యం ఎలా ఉందని ప్రశ్నించారు. తనకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, ఒక క్రానిక్ సమస్య ఉందని తెలిపారు. ఆయన హెల్త్ రిపోర్టులను పరిశీలిస్తున్నానని, పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఎప్పటికప్పుడు వాటిని తనకు అప్‌డేట్ చేస్తున్నారని న్యాయాధికారి తెలిపారు. వైద్యపరీక్షల రిపోర్టులను మీకు అందజేస్తున్నారా అని అడుగగా.. ఇస్తున్నారని ఆయన బదులిచ్చారు. పరీక్షించిన వైద్యులు పక్కన ఉన్నారా అని ప్రశ్నించగా.. వారు లైన్‌లోకి వచ్చారు. గురువారం ఉదయం వైద్య పరీక్షలు చేశారా అని వారిని న్యాయాధికారి అడిగారు. చేశామని వారు బదులిచ్చారు. చంద్రబాబు కూడా పరీక్షలు చేశారని చెప్పారు. మీ కేసుకు సంబంధించిన పిటిషన్లు హైకోర్టు, సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున తాను ఇంతకుమించి మాట్లాడలేనని న్యాయాధికారి చెప్పి ముగిస్తుండగా చంద్రబాబు తన విన్నపం వినాలని అభ్యర్థించారు.