నంద్యాల జిల్లా కేంద్రంలోని ప్రియాంక నగర్లో దారుణ ఘటన జరిగింది. ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న రమేష్ అనే వ్యక్తి మద్యం మత్తులో కన్న కొడుకునే కిరాతకంగా హత్య చేశాడు. రమేష్‌కు భార్య లక్ష్మి అనారోగ్యంతో నాలుగు నెలల క్రితం చనిపోయింది. కొడుకు రోహిత్ ఆర్జీఎం కాలేజీలో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. భార్య మరణంతో డిప్రెషన్‌కు గురైన రమేష్ మద్యానికి బానిసయ్యాడు. క్రమంగా ఆయన మానసిక ఆరోగ్య పరిస్థితి కూడా దెబ్బతింది. తండ్రి చేష్టలతో విసిగిపోయిన రోహిత్ తరుచూ ఆయనతో గొడపపడుతుండేవాడు. ఈ క్రమంలో తాజాగా జరిగిన గొడవలో రమేష్ విచక్షణ మరిచి కన్నకొడుకునే పొట్టన పెట్టుకున్నాడు. రోహిత్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని అతని ఇంటికి వెళ్లిన స్నేహితులు అక్కడి పరిస్థితి చూసి షాకయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. రోహిత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రమేష్ మానసిక పరిస్థితి బాగోలేకపోవడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు నంద్యాల టూటౌన్ సీఐ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.