మురుగు కాలువలను శుభ్రం చేస్తుండగా.. ఎంతో మంది మాన్యువల్ స్కావెంజర్స్ ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మ్యాన్యువల్ స్కావెంజర్స్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై తాజాగా సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. చేతులతో మురుగును శుభ్రం చేసే మాన్యువల్ స్కావెంజర్స్ ప్రమాద వశాత్తు చనిపోతే వారి కుటుంబాన్ని ఆదుకోవాలని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. అందు కోసం చనిపోయిన మాన్యువల్ స్కావెంజర్స్ కుటుంబాలకు భారీ పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మృతి చెందిన వారికి రూ.30 లక్షలు చెల్లించాలని స్పష్టం చేసింది.
దేశంలో మురుగు కాల్వలను శుభ్రం చేస్తూ చాలా మంది మాన్యువల్ స్కావెంజర్స్ చనిపోతున్నారని.. మరికొంతమంది వైకల్యానికి గురవుతున్నారని.. దీనిపై విచారణ చేపట్టాలని ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ అర్వింద్ కుమార్‌లతో కూడిన బెంచ్.. కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాన్యువల్ స్కావెంజింగ్‌ను సమూలంగా నిర్మూలించేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
చేతులతో మురుగు కాలువలను శుభ్రం చేస్తూ చనిపోయిన వారి కుటుంబాలకు రూ.30 లక్షల పరిహారం చెల్లించాలని సుప్రీం కోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మాన్యువల్ స్కావెంజర్‌గా పని చేస్తూ శాశ్వత అంగ వైకల్యానికి గురైన వారికి రూ. 20 లక్షల పరిహారం చెల్లించాలని సూచించింది. ఇతర రకాల వైకల్యానికి గురైన వారికి రూ.10 లక్షల చొప్పున ఇవ్వాలని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రమాద ఘటనలు జరగకుండా ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో వ్యవహరించాలని పేర్కొంది. మ్యాన్యువల్ స్కావెంజింగ్‌కు బదులు ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాలని సూచించింది.
దేశవ్యాప్తంగా గత 5 సంవత్సరాల్లో మురుగు కాలువలు శుభ్రం చేస్తూ దాదాపు 350 మంది మాన్యువల్ స్కావెంజర్స్ చనిపోయినట్లు 2022 లో లోక్‌సభలో ప్రభుత్వం వెల్లడించింది. ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో 40 శాతం మరణాలు సంభవించాయి. 2013, 2018 లో నిర్వహించిన సర్వేల ప్రకారం దేశంలో 58,098 మంది మురుగు కాలువలను శుభ్రం చేసే వృత్తిలో కొనసాగుతున్నట్లు రాజ్యసభకు ప్రభుత్వం తెలిపింది. అయితే మాన్యువల్ స్కావెంజింగ్‌పై నిషేధం ఉందని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ వృత్తిలో కొనసాగుతున్నవారికి పునరావాసం కల్పించాలని చట్టం కూడా చేసినా అది పూర్తిస్థాయిలో అమలు కాలేదు. కుల ఆధారిత వృత్తిపై 1993 లోనే నిషేధం విధించినప్పటికీ అది ఇప్పటికీ కొనసాగుతోందని కొందరు ఆరోపిస్తున్నారు.