ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాలస్తీనీయన్లపై దాడులకు వ్యతిరేకంగా నిరసన,,,,దారుస్సలాంలో అక్టోబరు 23న భారీ బహిరంగ సభ

national |  Suryaa Desk  | Published : Fri, Oct 20, 2023, 10:34 PM

గాజాపై ఇజ్రాయేల్ దాడులకు నిరసనగా హైదరాబాద్‌లో అక్టోబరు 23న బహిరంగ సభను నిర్వహిస్తున్నట్టు ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వెల్లడించారు. ఈ సభకు అన్ని రాజకీయ పార్టీలు, సంస్థల అధినాయకులను ఆహ్వానిస్తామని ఆయన తెలిపారు. సభలో ఎటువంటి రాజకీయ లేదా ఎన్నికల ప్రసంగాలకు అనుమతి లేదని హైదరాబాద్ ఎంపీ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని దారుస్సలాంలో బహిరంగ సభ ఉంటుందని ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు.


‘అక్టోబరు 23 సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని దారుస్సలాంలో గాజా, పాలస్తీనాల్లో ఇజ్రాయేల్ దౌర్జన్యాలకు నిరసనగా బహిరంగ సభను నిర్వహిస్తున్నాం.. అన్ని రాజకీయ పార్టీలు, సంస్థల అధిపతులను ఆహ్వానిస్తాం.. ఎన్నికలు లేదా రాజకీయ ప్రసంగాలకు అనుమతించం’ అని ఒవైసీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కాగా, హమాస్‌పై ఇజ్రాయేల్ ప్రతీకార దాడులతో గాజా నగరంలోని ప్రజలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తాగడానికి నీరు, తినడానికి తిండిలేక అల్లాడిపోతున్నారు. ఎటుచూసినా హృదయవిదారక దృశ్యాలే దర్శనమిస్తున్నాయి.


మంగళవారం అల్ అహ్లి ఆస్పత్రిలో భారీ పేలుడు చోటుచేసుకుని.. కనీసం 471 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ దాడిపై హమాస్, ఇజ్రాయేల్‌లు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఇజ్రాయేల్ వైమానిక దాడులే పేలుళ్ల కారణమని హమాస్ ఆరోపించగా.. పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ రాకెట్ మిస్‌ఫైర్ కావడంతోనే దుర్ఘటన జరిగిందని ఇజ్రాయేల్ ప్రకటించింది. కాగా, ఈ ఘటనపై ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో ఖండించాయి. అల్ అహ్లి ఆస్పత్రి పేలుడు ఘటనను ఖండించిన ప్రధాని నరేంద్ర మోదీ.. తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మృతులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇజ్రాయెల్-హమాస్ పోరులో పెరుగుతున్న పౌర ప్రాణనష్టంపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఈ మరణాల వెనుక ఉన్నవారు బాధ్యత వహించాలి అన్నారు. అక్టోబరు 7న 1,400 మంది పౌరులను ఊచకోత కోసిన హమాస్ దాడికి ప్రతీకారంగా.. గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయేల్ దాడులు చేస్తోంది. ఇప్పటి వరకూ ఈ యుద్ధంలో 3,478 మంది మరణించారని హమాస్ మంత్రిత్వ శాఖ పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com