పది అడుగులు ఎత్తులో నుంచి దూకితే ఎవరికైనా స్వల్ప గాయాలవుతాయి. ఇక, ఒక రెండు మూడు అంతస్తుల భవనం నుంచి దూకితే కాళ్లు చేతులు విరిగిపోవడం ఖాయం. ఇక, ఐదో అంతస్తు నుంచి దూకేస్తే ప్రాణాలతో ఉండటం అసాధ్యం. మనిషైనా.. అది జంతువైనా. కానీ, ఓ శునకానికి మాత్రం ఐదో అంతస్తు నుంచి దూకినా చిన్న గాయమైనా కాలేదు. కిందపడ్డ తర్వాత మామూలుగా లేచి, తోక ఊపుకుంటూ వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. శునకాన్ని సూపర్ డాగ్ అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు.
నిర్మాణంలో ఉన్న భవనం ఐదో అంతస్తు చివరన నిలబడి ఉన్న శునకం.. తొలుత అటు ఇటు చూసింది. ఏం ఆలోచించుకుందో ఏమో... కొద్దిసేపటి తర్వాత అమాంతం ఒక్క ఉదుటున కిందకు దూకేసింది. కింద ఉన్న గోడకు కాళ్లను సపోర్ట్ చేసుకుంది. అనంతరం వెంటనే లేచి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయింది. కిందకు దూకినప్పుడు కానీ... తర్వాత కానీ ఆ కుక్కకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు, ఏదో కుక్క దూకేసింది కదా... మనం కూడా అలా చేద్దామని సాహస కృత్యాలను ప్రయత్నించవద్దని పలువురు ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు.
ఆ శునకానికి ఆత్మవిశ్వాసంతో పాటు దూకే నైపుణ్యాలు సమానంగా ఉన్నట్లు అనిపించింది. కిందపడిన కొద్దిసేపటికే ఏమీ జరగనట్లుగా లేచి హీరోలా పరుగెత్తింది. సాహసాలను ఇష్టపడేవారు నిపుణుల పర్యవేక్షణలో ప్రయత్నించే ఒక అద్భుతమైన సాహసాన్ని చేసినట్టు ఆ శునకానికి తెలియదు. ఐదో అంతస్తు నుంచి దూకిన ఆ శునకం సాహసంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ కుక్క సాహసాన్ని , ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. నా చిన్నప్పుడు డాబర్‌మ్యాన్ ఒకసారి నాలుగో అంతస్తు నుంచి దూకిందని ఓ నెటిజన్ గుర్తుచేసుకున్నాడు. అయితే, ఈ ఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందో తెలియదు గానీ.. వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది.