ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో భారత్, కెనడాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నిజ్జర్ హత్య విషయంలో భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. ఆ తర్వాత కూడా అదే వైఖరిని అనుసరిస్తున్నారు. తాజాగా కెనడా ప్రభుత్వం విడుదల చేసిన ఓ అడ్వైజరీ.. ఇరు దేశాల మధ్య మరో వివాదానికి తెరలేపింది. భారత్‌లోని కెనడా పౌరులు.. తమ భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఇప్పుడు ఇదే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భారత్‌లోని కెనడియన్లు అప్రమత్తంగా ఉండాలని కెనడా ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. ఇక.. కెనడా పౌరులపై బెదిరింపులు, వేధింపులు జరగవచ్చని పేర్కొంది. భారత్‌లో నెలకొన్న పరిస్థితులతో మీడియా, సోషల్ మీడియాల్లో.. కెనడా పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే భారత్‌లోని పలు నగరాల్లో కెనడా వ్యతిరేక ఆందోళనలు, ప్రదర్శనలు జరిగే అవకాశాలున్నాయని అడ్వైజరీలో వెల్లడించింది.
అందువల్ల భారత్‌లో ఉండే కెనడియన్లు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఢిల్లీ, ఢిల్లీ చుట్టుపక్కన ఉన్న ప్రాంతాలతోపాటు, బెంగళూరు, ఛండీగఢ్, ముంబై నగరాల్లో ఉండే కెనడా వాసులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కొత్త వారికి తమ వ్యక్తిగత వివరాలు చెప్పొద్దని పేర్కొంది. ఇక భారత్‌లోని విదేశీయులు, పర్యాటకులే లక్ష్యంగా చేసుకుని కొంతమంది దొంగతనాలకు పాల్పడుతుంటారని.. రద్దీ ప్రాంతాలకు వెళ్లినప్పుడు అప్రమత్తంగా ఉండాలని కెనడా తమ అడ్వైజరీలో స్పష్టం చేసింది. భారత్‌లో ఉన్న కెనడా దౌత్య సిబ్బందిని తగ్గించడంతో ముంబై, ఛండీగఢ్, బెంగళూరు నగరాల్లో తమ కాన్సులేట్‌లను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ 3 నగరాల్లో అన్ని రకాల ఇన్ పర్సన్ సేవలను నిలిపివేసినట్లు స్పష్టం చేస్తూ తాజాగా అడ్వైజరీని విడుదల చేసింది. దౌత్య సిబ్బందిని ఉపసంహరించుకోవడంతో బెంగళూరు, ముంబై, ఛండీగఢ్ నగరాల్లో వ్యక్తిగత వీసా, కాన్సులర్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయినట్లు ప్రకటించింది. ఈ నగరాల్లో ఉండే కెనడియన్లు ఏదైనా అవసరమైతే ఢిల్లీలోని కెనడా హై కమిషన్‌ను సంప్రదించాలని సూచించింది.
భారత అంతర్గత విషయాల్లో కెనడా దౌత్యవేత్తలు ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించిన కేంద్రం.. భారత్‌లో ఉన్న అధిక దౌత్య సిబ్బందిని తగ్గించుకోవాలని స్పష్టం చేసింది. కెనడాలో భారత దౌత్యవేత్తలు ఎంతమంది ఉన్నారో అంతే స్థాయిలో భారత్‌లో కెనడా దౌత్య వేత్తలు ఉండాలని.. అంతకు మించి ఉన్నవారిని వెంటనే వెనక్కి పిలిపించాలని కేంద్రం అల్టిమేటం జారీ చేసింది. దీంతో భారత్ నుంచి 41 మంది దౌత్య సిబ్బందిని వెనక్కి రప్పించినట్లు కెనడా తాజాగా అధికారికంగా ప్రకటించింది.