దేశంలో నెలకొన్న వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న బియ్యం ధరలతో.. భారత్ నుంచి ఎగుమతి అయ్యే బియ్యంపై కేంద్ర ప్రభుత్వం కొన్ని నెలల క్రితం నిషేధం విధించింది. మొదట సన్న బియ్యం ఎగుమతులపై నిషేధం విధించిన భారత్.. ఆ తర్వాత క్రమంగా ఉప్పుడు బియ్యం, బాస్మతి బియ్యం ఎగుమతులను కూడా నిషేధించింది. ఈ క్రమంలోనే విదేశాల్లో ఉన్న భారతీయులతోపాటు.. బియ్యం తినే వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. భారత్ నుంచి వచ్చే బియ్యం ఎగుమతులపై నిషేధం విధించడంతో అమెరికా సహా వివిధ దేశాల్లో బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయి. అయితే తాజాగా ఆ ఆంక్షలను సవరించిన కేంద్రం.. 7 దేశాలకు బియ్యాన్ని ఎగుమతి చేయాలని నిర్ణయించింది.
ఆహార భద్రత దృష్ట్యా అవసరాలు ఉన్న 7 దేశాలకు సుమారు 10 లక్షల టన్నుల బియ్యాన్ని సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది.
మొత్తం 7 దేశాలకు 10 లక్షల టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బాస్మతీయేతర బియ్యాన్ని విదేశాలకు పంపించేందుకు భారత్ అనుమతించింది. నేపాల్, మలేషియా, ఫిలిప్పిన్స్, సీషెల్స్, కామెరూన్, ఐవొరీ కోస్ట్, రిపబ్లిక్ ఆఫ్ గినియా దేశాలకు బాస్మతీయేతర బియ్యాన్ని ఎగుమతి చేయవచ్చని తాజాగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. నేషనల్ కో ఆపరేటివ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్, ది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్‌ల ద్వారా మాత్రమే బియ్యం ఎగుమతులకు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ ఏడు దేశాలకు మొత్తం 10.34 టన్నుల బాస్మతీయేతర తెల్ల బియ్యాన్ని ఎగుమతి చేయవచ్చని తెలిపింది. ఇందులో నేపాల్‌కు 95 వేల టన్నులు, కామెరూన్‌కు 1.90 లక్షల టన్నులు, ఐవొరీ కోస్ట్‌కు 1.42 లక్షల టన్నులు, రిపబ్లిక్ ఆఫ్ గినియాకు 1.42 లక్షల టన్నులు, మలేషియాకు 1.70 లక్షల టన్నులు, ఫిలిప్పిన్స్‌కు 2.95 లక్షల టన్నుల తెల్ల బియ్యం ఎగుమతులకు అనుమతి మంజూరు చేసింది. యూఏఈ, సింగపూర్ దేశాలకు కూడా బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దేశంలో వర్షాభావ పరిస్థితులు, ఉత్పత్తి తగ్గిపోవడం, ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతో దేశంలో బియ్యం కొరత రాకుండా చూసేందుకు.. ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే బియ్యంపై కేంద్ర ప్రభుత్వం క్రమంగా ఆంక్షలు విధిస్తూ వస్తోంది. దేశ ప్రజల అవసరాల కోసం 2023 జూలై 20 వ తేదీన బాస్మతీయేత బియ్యం ఎగుమతులపై నిషేదం విధించింది.