టీటీడీ బడ్జెట్ నుంచి తిరుపతి అభివృద్ధికి ఏటా ఒక్క శాతం నిధులు ఖర్చు చేసేందుకు ఇటీవల పాలకమండలి చేసిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల వలవన్ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. టీటీడీ బడ్జెట్ ఈ ఏడాది సుమారు రూ.4,411 కోట్లు కాగా.. తిరుపతిలో అభివృద్ధికి రూ.44 కోట్ల మేర ఖర్చు చేసేందుకు వీలుగా ఇటీవల జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో తీర్మానించారు. దీనిని బీజేపీతో పాటూ హిందూ సంఘాలు వ్యతిరేకించాయి. కార్పొరేషన్ ద్వారా చేయాల్సిన పనులను భక్తుల విరాళాలైన టీటీడీ నిధులతో ఎలా చేస్తారని ప్రశ్నించాయి. జిల్లా కేంద్రాల్లో నిరసనలకు దిగాలని వీహెచ్‌పీ పిలుపునిచ్చింది. ఈలోపే టీటీడీ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్వర్వులు ఇచ్చింది.
బడ్జెట్‌లో ఒక శాతం నిధులను తిరుపతి అభివృద్ధికి కేటాయిస్తామంటూ ప్రభుత్వానికి టీటీడీ ఈవో లేఖ పంపించారు. ఇది అందిన 5 రోజుల్లోనే ప్రభుత్వం స్పందించింది. టీటీడీ నిధులను తిరుపతి అభివృద్ధికి కేటాయించడాన్ని ప్రభుత్వం అంగీకరించడంలేదని దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి కరికాలవలవన్ శుక్రవారం సర్క్యులర్ జారీ చేశారు. తిరుపతిలో అనేక అభివృద్ధి పనుల కోసం టీటీడీ ఎంతోకాలంగా నిధులు వెచ్చిస్తోంది. అది ఏనాడూ వివాదాస్పదం కాలేదు. తిరుపతి నగరంలోని తొమ్మిది ప్రధాన రహదారులను టీటీడీయే సొంత నిధులతో నిర్వహిస్తోంది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు టీటీడీ రూ.350 కోట్లు కేటాయించింది. తిరుపతిలోని ప్రముఖ విద్యా, వైద్య సంస్థలను కూడా టీటీడీయే నిర్వహిస్తోంది. వివిధ సందర్భాల్లో పాలకమండలిలో తీర్మానాలు చేసి తిరుపతి అవసరాలకు ఖర్చు పెడుతున్నారు. కానీ ఈ అంశం మాత్రం వివాదాస్పదం అయ్యింది.
టీటీడీ ఆదాయంలో ఒక్క శాతం నిధులు తిరుపతి అభివృద్ధికి కేటాయించాలన్న పాలక మండలి సిపారసును నేడు తిరస్కరించడం ఇది శ్రీవారి భక్తులు , హిందుసంస్థల గొప్ప విజయం అన్నారు బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి. అఖిలాండ కోటి బ్రహ్మాండనాయుకునికి తాము భక్తితో ముడుపు కట్టి ఇచ్చే కానుకల్ని భక్తుల సౌకర్యాలకు, హిందూ ధర్మ ప్రచారానికి మాత్రమే వినియోగించడం భక్తులను గౌరవించడమే అన్నారు.టీటీడీ పాలకమండలిలోని కొంత మంది సభ్యులు ఏ ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారో కానీ భక్తులు ఆందోళన చెందారన్నారు.
ఈ అంశంపై భక్తుల ఆందోళనను నేను కూడా లేఖ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లినట్లు చెప్పారు. ప్రభుత్వం భక్తుల ఆందోళనను వెంటనే గుర్తించి టీటీడీ ప్రతిపాదనను తిరస్కరించడం మంచిదే అన్నారు. ఇప్పటికైనా టీటీడీ పాలక మండలి.. శ్రీవారి నిధుల విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు.. హిందూ సమాజం , పీఠాధిపతులు మరియు హిందు సమాజంలో పెద్దలతో మేథోమథనం జరపిన తర్వాతనే నిర్ణయానికి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను.