175 నియోజకవర్గాల్లోనూ గెలుపు లక్ష్యంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూసుకు పోతోంది. ఒకవైపు ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహిస్తూనే మరోవైపు పార్టీ పరమైన కార్యక్రమాలకు కూడా ముఖ్యమంత్రి వైయస్ జగన్ కార్యాచరణ సిద్ధం చేశారు. గతేడాది మే నెలలో ప్రారంభమైన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి విశేష స్పందన లభించిన నేపథ్యంలో ఇప్పుడు పార్టీ పరమైన కార్యక్రమాలను కూడా మరింత వేగంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 26 నుండి రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతాల్లోనూ ఒకేసారి బస్సుయాత్రలు ప్రారంభం కాబోతున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా మూడు బస్సులను రెడీ చేశారు. బస్సుల ముందు భాగంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఫ్యాను ప్రముఖంగా కనిపించేలా స్టిక్కరింగ్ చేశారు. పైభాగాన సామాజిక సాధికార యాత్ర పేరు కనపడేలా చేశారు. ఇక మిగతా మూడు వైపులా మా నమ్మకం నువ్వే జగన్ పేరుతో స్టిక్కర్లు, పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫోటోలను ఏర్పాటు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రమఖుల చిత్రాలను కూడా బస్సు మీద ఏర్పాటు చేశారు. ఇక బస్సు యాత్రలు తొలిరోజు అంటే ఈ నెల 26న ఉత్తరాంధ్రలోని ఇచ్చాపురం, కోస్తాంధ్రలో తెనాలి, రాయలసీమలో సింగనమల నియోజకవర్గాలలో ప్రారంభం కాబోతున్నాయి.