ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓట్ల తొలగింపునకు కుట్ర.. వారంలో 2.45 లక్షల దరఖాస్తులు: టీడీపీ ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 25, 2023, 07:05 PM

వైఎస్సార్‌సీపీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఓటర్ లిస్టుల్లో అనేక అవకతవకలకు పాల్పడుతోందన్నారు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు .ఈ ప్రభుత్వం నాలుగున్నరేళ్ల పరిపాలనపై ప్రజలు విసిగి పోయారని.. సామాన్య ప్రజలు మొదలుకొని అన్ని వర్గాల ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోను ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని దృఢ సంకల్పంతో ఉన్నారన్నారు. కానీ అధికారాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో వైఎస్సార్‌సీపీ కుట్రలు, కుతంత్రాలు చేస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ లిస్టుల్లో అవకతవకలకు పాల్పడుతోందని.. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నవారు, ఈ ప్రభుత్వానికి ఓటు వేయరని భావించిన వారి పేర్లను ఓటర్ లిస్టు నుంచి తొలగించడానికి కుట్రలు జరుగుతోంది అన్నారు.


గ్రామాలు, పట్టణాల్లో ఉన్న వాలంటీర్ల సాయంతో ప్రభుత్వానికి వ్యతిరేకుల ఓట్లు తొలగించేందుకు ఉపయోగించే ఫామ్ 7ని భారీగా అప్‌లోడ్ చేస్తున్నారన్నారు. కొన్ని చోట్ల బీఎల్‌వోలను బెదిరించి ఓట్లు తొలగిస్తున్నారన్నారు. కొందరు అధికారులను భయపెట్టడం, బెదిరించడం, పోస్టింగులు ఇస్తామని ఆశ చూపిస్తున్నారన్నారు. కొందరు ఉద్యోగులు వైఎస్సార్‌సీపీకి కొమ్మ కాస్తున్నారని.. ఇటీవల పర్చూరులో 14 వేలకు పైగా ఫామ్ 7లు దరఖాస్తు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక్కడ దుర్మార్గంగా వ్యవహరించారని.. గ్రామంలో పుట్టినప్పటి నుంచి ఉన్నవారు 189 మంది పేర్లను తొలగించాలని ప్రయత్నించారన్నారు.


ఈ సమాచారాన్ని తాము పై అధికారులకు పంపామని.. వారు ఎంపిక చేసుకున్న నియోజకవర్గంలోని 25 వేల మంది ఓట్లు తొలగించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. దీన్ని అడ్డుకోవాలని కోరామని.. అయినా ఫలితం లేదన్నారు. ఎన్నికల సంఘానికి పదే పదే చెప్పినా ఎన్నికల సంఘంలో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ అధికారులకు.. వైఎస్సార్‌సీపీ నాయకులు ఓటు హక్కును హరిస్తున్నారని చెప్పినా ఎవరూ స్పందించలేదన్నారు. దీనిపై హైకోర్టుకు వెళ్లామని.. హైకోర్టు స్పందించి భారత ఎన్నికల కమిషన్ నుంచి కిందిస్థాయిలో ఉండే బీఎల్వోల వరకు మొత్తం సమాచారాన్ని సమర్పించమని కోర్టు చెప్పిందన్నారు.ఇది మంచి పద్ధతి కాదని కోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిందన్నారు.


అప్పుడు కంటితుడుపుగా అధికారులు జాగ్రత్త పడ్డారన్నారు.. దిద్దుబాటు చర్యలు చేపట్టారన్నారు. ఇందులో భాగంగా ఫామ్ 7 లు పెట్టిన 16 మందిపై ఐపీసీ యాక్టు ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేశారన్నారు. 12 మంది బీఎల్‌వోలకు షోకాజ్ నోటీసులు ఇచ్చారన్నారు. వాస్తవంగా 189మంది ఈ కుట్రలో భాగస్వాములయ్యారని.. వీరికి దాదాపు 12 వందల మంది సహాయ సహకారాలు అందించారన్నారు. వీరు ఓటీపీ షేర్ చేసినవారిలో ఉన్నారని.. సమగ్ర విచారణ చేయలేదన్నారు. కంటి తుడుపు చర్యలు మాత్రమే చేపట్టారన్నారు. కోర్టులను తప్పుదారి పట్టించారని.. భారత ఎన్నికల సంఘాన్ని కూడా తప్పుదారి పట్టించారన్నారు.


అధికారులు కూడా ఇందులో భాగస్వాములేనని.. ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి సంబంధం లేకపోయినా మార్టూరు, యుద్దనపూడి, పర్చూరు మండలాలకు చెందిన సబ్ ఇన్స్ పెక్టర్లు, మార్టూరు సర్కిల్ ఇన్స్ పెక్టర్ వీరందరూ ఈ ఫామ్ 7లను పెట్టడంలో ఒత్తిడి తెచ్చినట్లు సాక్ష్యాధారాలతో భారత్ ఎన్నికల సంఘానికి టీడీపీ తరపున ఫిర్యాదు చేశామన్నారు. వారిని నిన్న బాపట్ల ఎస్పీ వీఆర్‌కు పంపారని.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా అధికారులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారన్నారు. తాము సాక్ష్యాలు చూపెడితే చర్యలు తీసుకోకుండా కేవలం తూతూ మంత్రంగా మాత్రమే చర్యలు తీసుకున్నారన్నారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అధికారులు జిల్లా కలెక్టర్, ఎస్పీ, సీఈవో, వీఆర్వో అందరూ బాధ్యత మరచి వ్యవహరిస్తున్నారన్నారు. చంద్రబాబు అక్రమంగా అరెస్టు అయిన రోజు నుంచి వైఎస్సార్‌సీపీ వ్యతిరేక ఓట్లను తొలగించే పని మొదలైందన్నారు. ప్రస్తుతం ఓటర్ లిస్టు సవరణలు జరుగుతున్నాయని.. ఇందులో ఇప్పటి వరకు 7 లక్షల 60వేల ఫామ్ 7లు రాష్ట్ర వ్యాప్తంగా అప్లై చేస్తే కేవలం చంద్రబాబునాయుడు అరెస్టు అయినప్పటి నుంచి.. అంటే సెప్టెంబర్ 8 నుంచి 15వ తేది వరకు అంటే వారం రోజుల్లో 2 లక్షల 44 వేల 551 ఫామ్ 7 లను వీరు అప్ లోడ్ చేశారన్నారు.


చంద్రబాబును అరెస్టు చేశారని రాష్ట్ర ప్రజలు ఆందోళన చేస్తుంటే ఆ సమయంలో అధికారులను అడ్డం పెట్టుకొని 2 లక్షల 44 వేల మంది ఓట్లను తొలగించడానికి కుట్ర పన్నారన్నారు. ఈ నాలుగు నెలల్లో కొత్త ఓట్ల ఎన్‌రోల్‌మెంట్‌లో సుమారు 6 లక్షల 80 వేల ఓట్లు నమోదు చేసుకోవడానికి అప్లై చేస్తే కేవలం చంద్రబాబు అరెస్టు అయిన వారంలో లక్షా 20 వేల 44 ఓట్లు కొత్తగా ఎన్ రోల్ చేశారన్నారు. తెలుగుదేశం సానుభూతిపరుల ఓట్లు తీసివేయడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారనే అనుమానం ఉన్న వారి ఓట్లు తొలగించారన్నారు. వారికి అనుకూలంగా వున్న వ్యక్తులకు ఒకే చోట నాలుగైదు ఓట్లు వచ్చేటట్లు ఫామ్ 6లు దరఖాస్తు చేశారన్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com