ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ.. ఆయన సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి అనే కార్యక్రమాన్ని చేపట్టారు. కాగా.. ఈ కార్యక్రమంలో భాగంగా ఆమె నారావారిపల్లెలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన భువనేశ్వరి భావోద్వేగానికి లోనయ్యారు. రెండు రోజులుగా నారావారిపల్లెలో ఉన్నానని... ఎప్పుడూ కుటుంబంతో వెళ్లే దాన్ని.. కానీ ఈసారి ఒక్క దానినే వెళ్తే గుండె తరుక్కుపోతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి సారి తాను రాజకీయ సభలను వస్తున్నానని చెప్పారు. నిజం గెలవాలని చెప్పేందుకు తాను ప్రజల ముందుకు వచ్చానన్నారు. నిజం గెలవాలనే పోరాటం తన ఒక్కదానిదే కాదని.. ఈ పోరాటం అందరిదని చెప్పుకొచ్చారు. భావితరాల కోసం, చంద్రబాబును బయటకు తీసుకురావడం కోసం పోరాటం చేయాలన్నారు భువనేశ్వరి.
"ఎన్టీఆర్ కుమార్తేగా పుట్టడం నా అదృష్టం. ఎన్టీఆర్ స్పూర్తితో నారా చంద్రబాబు నాయుడు పరిపాలన చేశారు. ఎన్టీఆర్ స్పూర్తితోనే ఎన్టీఆర్ ట్రస్టు చంద్రబాబు నెలకొల్పారు. 3 వేల మందికి పైగా పేద విద్యార్ధులను చదివిస్తున్నాను. చంద్రబాబు గురించి నా కంటే మీకే బాగా తెలుసు. ఎప్పుడూ ఆయనకు ప్రజలే కుటుంబం. ప్రజల తర్వాతే మేము. హైదరాబాదులో హైటెక్ సిటీ కట్టింది చంద్రబాబే. హైటెక్ సిటీ కడుతుంటే అందరూ విమర్శించారు. చంద్రబాబు విజన్ ఏంటో ప్రజలందరికీ తెలుసు. ఐటీ రంగంను తీసుకుని వచ్చి లక్షలాది మంది జీవితాల్లో సంతోషాన్ని నింపారు చంద్రబాబు. రాష్ట్రం అభివృద్ధి కోసం చంద్రబాబు ఎలా కష్ట పడ్డారో నేను కళ్లారా చూశా. ప్రజలు బాగుంటే రాష్ట్రం అభివృద్ధి చేందుతుందని నమ్మిన వ్యక్తి చంద్రబాబు." అని చెప్పుకొచ్చారు భువనేశ్వరి.
"45 రోజులుగా చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్భందించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాం అంటారు, ఫైబర్ గ్రిడ్ అంటారు. దేశంలో ఏపీని నెంబర్ వన్‌గా ఉంచాలని నిత్యం చంద్రబాబు ఆలోచిస్తుంటారు. అలాంటి చంద్రబాబును అరెస్టు చేసి జైల్‌లో పెట్టడం భాధాకరం. చిత్తూరు జిల్లాలో చంద్రబాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. శ్రీకాకుళం నుంచి పుంగనూరు వరకు సైకిల్ యాత్ర చేస్తున్న టీడీపీ కార్యకర్తలను అడ్డుకోవడం దారుణం. వైసీపీ నాయకులు ఎన్ని కష్టాలు పెట్టినా పైకి లేచి మరీ టీడీపీ కార్యకర్తలు నిలబడుతున్నారు. యావత్తు ప్రపంచంలోని ప్రజలంతా చంద్రబాబు కోసం పోరాడుతున్నారు." అని భువనేశ్వరి తెలిపారు.
ఇవాళ కాక పోయినా రేపైనా నిజం గెలుస్తుందని భువనేశ్వరి ఆకాంక్షించారు. చంద్రబాబును నిర్భందిస్తే, మెంటల్‌గా డిస్ట్రబ్ అవుతారని వైసీపీ భావిస్తుందని కానీ.. ఆయన చాలా స్ట్రాంగ్ పర్సన్ అని తెలిపారు. ఎన్నికల ముందు కావాలనే చంద్రబాబును జైలుకు పంపారన్నారు. మళ్లీ చంద్రబాబు అందరి ముందుకు వస్తారన్నారు. చంద్రబాబు పరిపాలనలో రాష్ట్ర ఎంతో సంతోషంగా ఉండేదని.. ఇప్పుడు రాష్ట్రంలో గంజాయి, అరాచకాలు, రౌడీయిజం తప్ప ఏమీ కనిపించట్లేదన్నారు. మహిళలకు రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ రాష్ట్రాన్నే కాకుండా న్యాయాన్ని కూడా నిర్భంధించిందన్నారు. నిజం గెలవాలని అందరం చేయి చేయి కలిపి పోరాడాలని భువనేశ్వరి పిలుపునిచ్చారు.