ఏపీలో రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లో ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. ఈనెల 27 నుంచి 29 వరకు రాజమహేంద్రవరం-విశాఖ(07466), విశాఖ-రాజమహేంద్రరం(07467) ప్రత్యేక పాసింజర్ రైళ్లు, 27, 28 తేదీల్లో విశాఖ-విజయవాడ (22701), విజయవాడ-విశాఖ(22702) ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేసినట్లు ప్రకటనలో చెప్పారు. తూర్పుకోస్తా రైల్వే కేకేలైనులో పలు రైళ్లను కూడా కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం తెలిపారు. ఈనెల 28 వరకు విశాఖ-కిరండూల్(18514) రాత్రి ఎక్స్‌ప్రెస్, హావ్‌డా-జగదల్‌పూర్(18005), భువనేశ్వర్- జగదల్‌పూర్(18447) రైళ్లను కొరాపుట్‌లో నిలిపివేస్తారన్నారు. ఈ రైళ్లు తిరుగు ప్రయాణంలో కొరాపుట్ నుంచి బయలుదేరుతాయని చెప్పారు.
మరోవైపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి దేశ రాజధాని దిల్లీకి అమృత్ కలశ్ యాత్ర పేరుతో ప్రత్యేక రైలు నడపనున్నారు. 'నా మట్టి.. నా దేశం' కార్యక్రమంలో భాగంగా పవిత్రమైన మట్టిని సేకరించి ఢిల్లీలోని ఇండియా గేట్‌లో జరిగే అమృత్ మహోత్సవ్‌లో ఉపయోగించనున్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులకు ఈ సందర్భంగా నివాళులర్పిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశ వ్యాప్తంగా ప్రజలను ఆహ్వానిస్తూ గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయిలో ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ నెల 28న ఉదయం 10 గంటలకు ప్రత్యేక రైలు నంబరు 07209/07210 విజయవాడలో బయలుదేరి ఖాజీపేట, బలార్ష, నాగ్‌పూర్, ఇటార్సి, భోపాల్, ఆగ్రా మీదుగా హజ్రత్‌నిజాముద్దీన్ చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ట్రాక్ మరమ్మతుల కారణంగా పలు ప్యాసింజర్ రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. ఈ నెల 30వ తేదీ వరకు విజయవాడ నుంచి ఖమ్మం మదుగా నడిచే డోర్నకల్ విజయవాడ, విజయవాడ డోర్నకల్, భద్రాచాలం రోడ్డు విజయవాడ రైళ్లను రద్దు చేస్తున్నట్లు గతంలోనే ప్రకటించారు. అధికారులు తాజాగా మరికొన్ని రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.