నాలుగున్నరేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమైనా వచ్చిందా అని ప్రశ్నించారు నారా భువనేశ్వరి. రాష్ట్రంలో బిడ్డలకు ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా.. వేధించడం, ఇబ్బందులు పెట్టడం గొప్ప అనుకుంటున్నారని మండిపడ్డారు. నిరాహార దీక్షలు చేసిన వారిపై హత్యాయత్నం కేసులు కాదు.. ఎండుతున్న పొలాలకు నీళ్లివ్వండిని సూచించారు. ప్రభుత్వ దృష్టి చంద్రబాబు రాసిన లేఖపై కాదని.. అభివృద్ధిపై పెట్టాలన్నారు. ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా తిరుపతిలో జరిగిన సభలో మహిళలతో మాట్లాడారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
తాత ఎక్కడ అని మనవడు దేవాన్ష్ అడుగుతున్నారని.. ఆయన జైల్లో ఉన్నట్లు దేవాన్ష్‌కు తెలియదన్నారు భువనేశ్వరి. చిన్న వయసు కావడంతో తనకు చెప్పదల్చుకోలేదని.. తాత విదేశాలకు వెళ్లారని చెబుతున్నామన్నారు. తమ ఇంట్లో ఎప్పుడు శుభకార్యం జరిగినా మనసులోకి వచ్చేది వెంకటేశ్వరస్వామి అన్నారు భువనేశ్వరి. ఎప్పుడు వెళ్లినా కుటుంబ సమేతంగా వెళ్లేదాన్ని.. కానీ మొన్న ఒక్కదాన్నే వెళ్లానన్నారు. చంద్రబాబు అరెస్టుతో నలుగురం నాలుగు దిక్కులయ్యామని.. చంద్రబాబును నిర్బంధించి 48 రోజులు అయ్యిందన్నారు. మనవడు దేవాన్ష్ ను చూడక 48 రోజులు అయ్యిందన్నారు.
ఎన్నికలు సమీపిస్తుండటంతో తప్పుడు కేసులు పెట్టి టీడీపీని బెదరగొట్టాలని చూస్తున్నారని.. ముందు రూ.3 వేల కోట్లు అన్నారు.. చివరికి రూ.27 కోట్లు అంటున్నారన్నారు. సాక్ష్యాధారాలు లేకుండా 48 రోజుల నుంచి చంద్రబాబును జైల్లో నిర్బంధించారన్నారు. ప్రజల సొమ్ముతో తమ కుటుంబం ఎప్పుడూ బతకలేదని.. తాను సీఐడీ అధికారులకు గ్యారంటీ ఇస్తాను.. వచ్చి ఏం తనిఖీ చేసుకుంటారో చేసుకోవచ్చన్నారు. ఎన్నికల ముందు ఆయన్ను ప్రజల నుంచి దూరం చేయాలనుకున్నారని.. లోకేష్ పాదయాత్రకు వచ్చిన స్పందన, చంద్రబాబు చేపట్టిన ‘భవిష్యత్తుకు గ్యారంటీ’ కార్యక్రమాలు విజయవంతం కావడంతో భయపడి ఆయన్ను అరెస్టు చేశారన్నారు. దీంతో లోకేష్ పాదయాత్ర ఆపేస్తాడని అనుకున్నారని.. మళ్లీ పాదయాత్ర మొదలుపెట్టి ప్రజల వద్దకు వస్తారన్నారు.
దసరా సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు చంద్రబాబు లేఖ రాస్తే.. ఈ ప్రభుత్వానికి వేరే పని లేకుండా దానిపై విచారణ చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, రైతులకు విద్యుత్తు, నీరు ఎలా ఇవ్వాలని ఆలోచించాలని ప్రభుత్వానికి హితవు పలికారు. గతంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమల్లో ఇప్పుడు ఒకటి రెండు తప్ప అన్నీ రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయన్నారు. రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్తున్నాయని.. రాష్ట్ర యువతకు రావాల్సిన ఉద్యోగాలున్నీ పక్క రాష్ట్రాల యువతకు పోతున్నాయన్నారు. అమర్ రాజా బ్యాటరీస్ ఈ జిల్లాలో 30 ఏళ్లుగా ఉంది.. వాళ్లనూ ఇబ్బందలు పెట్టారన్నారు. రూ.9,300 కోట్ల పెట్టుబడిని తెలంగాణలో పెట్టారు.. దీంతో అక్కడి యువతకు ఉద్యోగాలు కల్పించారన్నారు.
తాను కూడా హెరిటేజ్ నడిపిస్తున్నానని.. ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలో హెరిటేజ్ ఉందన్నారు. ఆయా రాష్ట్రాలు హెరిటేజ్‌ను ఆహ్వానించి పరిశ్రమకు ఏం కావాలో అడుగుతారని.. అన్నీ ఇచ్చి పెట్టుబడుల్లో ముందుకు తీసుకెళ్తారన్నారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్ కు ఐఎస్బీ తీసుకొచ్చారని.. దాని వెనక చంద్రబాబు ఎంతో కష్టం ఉందన్నారు. ఇప్పుడు వేలమంది విద్యార్థలు అక్కడ చదివి ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు తీసుకుంటున్నాన్నారు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం పెట్టుబడి దారులను హిసించి, భయపెట్టి బయటకు పంపిస్తున్నారన్నారు. అందరినీ భయపెట్టి కేసులు పెడుతున్నారన్నారు.
తనను పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు బాగున్నారా అమ్మ అని ఆప్యాయంగా అడిగారన్నారు. ఈ రాష్ట్రంలో జరిగే అత్యాచారాల గురించి చెప్పి బాధపడ్డారని.. ఆయన కూడా రాష్ట్రం కోసం ఆలోచిస్తున్నారని.. రెండు పార్టీలు కలసి ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను అన్నారు. రాష్ట్రంలో ఈ ప్రభుత్వంతో స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నామని.. ఈ కార్యక్రమానికి తాను రాకముందు చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించాలని చంద్రబాబు చెప్పారన్నారు. టీడీపీ ఎప్పుడూ వారికి అండగా ఉంటుందని చెప్పారు. లక్షల మందికి ఆయనపై అభిమానం ఉందని.. తనకు చాలా గర్వంగా ఉందన్నారు. భవిష్యత్ కోసం చేసే పోరాట బలంతో గెలుపు తథ్యం అని చెప్పారు. అందుకే కలిసి కట్టుగా నడుం బిగించి ఎన్టీఆర్ ఇచ్చిన పౌరుషంతో, చంద్రబాబు ఇచ్చిన క్రమశిక్షణతో పోరాడుదామన్నారు.