సీఎం జగన్ ప్యాలస్ విడిచి జనంలోకి రావాలి అంటూ ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు వ్యాఖ్యానించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పొలాలు ఎడారులుగా మారుతున్న పరిస్థితి నెలకొందని.. ముఖ్యమంత్రి పొలం బాట పట్టాలని డిమాండ్ చేశారు. వర్షాభావ పరిస్థితి వలన పొలాలు ఎండిపోయి రైతులు దుర్భర పరిస్థితుల్లో ఉన్నారని తెలిపారు. పంట నష్టపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. తక్షణమే ముఖ్యమంత్రి స్పందించి కరువు మండలాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులకు తక్షణ సాయంగా లక్ష ఆర్ధిక సాయం అందజేయాలన్నారు. పంట ఎండిపోయిన పొలాల రైతులకు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. కేంద్రం మెడలు వంచి హోదా తీసుకువస్తామని చెప్పి, కేంద్రం ముందు సాగిలా పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన చట్టం అమలైతే హోదాతో పాటు వెనుకబడిన ప్రాంతాలకు నిధులు వస్తాయన్నారు. రైతులను, ఆక్సిడెంట్ బాధితులను ఆదుకోవాలని ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాస్తున్నామననారు. ఓబీసీ కులగణనపై రేపు గుంటూరులో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. త్వరలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో కూడా ఓబీసీ కులగణనపై సమావేశాలు నిర్వహిస్తామన్నారు. సమావేశాలకు ఏపీసీసీ, ఏఐసీసీ నాయకులు పాల్గొంటారని గిడుగు రుద్రరాజు వెల్లడించారు.