విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. సిగ్నల్ కోసం ఆగి ఉన్న ప్యాసింజర్ రైలును విశాఖ-రాయగడ రైలు ఢీకొట్టింది కొత్తవలస మండలం అలమండ-కంటకాపల్లి వద్ద రెండు రైళ్లు ఢీకొన్నాయి. విశాఖపట్నం నుంచి పలాస వెళ్తున్న ప్రత్యేక ప్యాసింజర్ రైలు సిగ్నల్ లేకపోవడంతో అలమంద-కోరుకొండ రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలపై నిలిచిపోయింది. ఆ సమయంలో విశాఖ-రాయగడ ప్రత్యేక రైలు వెనుక ఆగి ఉన్న ప్యాసింజర్ రైలును ఢీకొట్టింది. రైల్వే సిబ్బంది, స్థానిక పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ రైలు ప్రమాదంలో మూడు బోగీలు పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడినట్లు సమాచారం. రెండు రైళ్లు ఢీకొనడంతో ఈ ప్రాంతంలో విద్యుత్ తీగలు తెగిపడి విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలిస్తున్నారు.