ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హిమాలయాలకు వెళ్తున్నట్లు ప్రకటించిన బీజేపీ ఫైర్‌బ్రాండ్ ఉమాభారతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 29, 2023, 10:57 PM

ఉమాభారతి. బీజేపీలో ఫైర్ బ్రాండ్. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి అయిన ఉమాభారతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను హిమాలయాలకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ ఎన్నికలు జరగనున్న వేళ ఆ రాష్ట్రంలో కీలక నేత అయిన ఉమా భారతి ఇలాంటి ప్రకటన చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే మధ్యప్రదేశ్ ఎన్నికల్లో తనకు సరైన ప్రాతినిథ్యం ఇవ్వలేదని పార్టీ అధిష్ఠానంపై అలకబూనిన ఉమా భారతి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక తనకు సొంత పార్టీలోనే చిరకాల ప్రత్యర్థి అయిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను ఆమె ప్రశంసించడం విశేషం.


మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో బీజేపీ అగ్ర నాయకత్వం క్రియాశీల బాధ్యతలు ఇవ్వకపోవడంతో మాజీ సీఎం, కేంద్ర మాజీమంత్రి ఉమాభారతి తీవ్ర కలత చెందారు. ఈ క్రమంలోనే హిమాలయాలకు వెళ్తున్నట్లు ట్విటర్‌లో ప్రకటించడం సంచలనగా మారింది. ఈ సందర్బంగా సుదీర్ఘ వ్యాసం రాశారు. తన స్వస్థలమైన టికామ్‌గర్ జిల్లాలోని దుండా గ్రామానికి వెళ్తున్నట్లు తెలిపారు. అక్కడ రెండు రోజులు ఉండి.. తమ కులదైవానికి పూజలు నిర్వహించి అక్కడి నుంచి హిమాలయాలకు వెళ్తానని చెప్పారు.


ఈ క్రమంలోనే ఆమెకు తన సొంత పార్టీలోనే ఉన్న చిరకాల ప్రత్యర్థి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై ఆమె ప్రశంసలు కురిపించారు. ఈ ఏడాదిలో మధ్యప్రదేశ్ సీఎం ఆదర్శవంతమైన మద్యం పాలసీని తీసుకువచ్చారని పేర్కొన్నారు. ఇక శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎంగా ఉన్న గత మూడున్నరేళ్లలో అనేక ప్రజా సంక్షేమ పనులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. తాజా ఎన్నికల్లో కూడా తమ పార్టీ తరఫున పోటీ చేసే వారి అభ్యర్థుల పేర్లు ప్రకటించారని.. మధ్యప్రదేశ్‌లో బీజేపీ మేనిఫెస్టో ఇంకా వెలువడాల్సి ఉందని చెప్పారు.


తాను కష్టపడి పని చేస్తానని.. బీజేపీ ప్రభుత్వం మళ్లీ ఏర్పడాలని తనతోపాటు అందరి ఆకాంక్ష అని.. అది నెరవేరాలని భగవంతుడిని ప్రార్థిస్తానని తెలిపారు. అయితే ఈ క్రమంలోనే తమ ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన కొన్ని పనులను కూడా ఉమాభారతి వెల్లడించారు. 2017 లో శంకుస్థాపన అయిన కెన్-బెట్వా రివర్ లింక్ ఇప్పటికీ పూర్తి కాలేదని పేర్కొన్నారు. ఇక గోవుల ప్రోత్సాహం, గోసంరక్షణ చర్యలు సంతృప్తికరమైన స్థాయికి చేరుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటు రాష్ట్రంలో, కేంద్రంలో తమ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పటికీ ధర్ భోజ్‌శాలకు చెందిన సరస్వతి మయి తన సింహాసనాన్ని తిరిగి పొందలేకపోయిందని అసహనం వ్యక్తం చేశారు. తమ పార్టీ అగ్రనేతల్లో ఒకరు తనకు హామీ ఇచ్చినప్పటికీ రైసెన్‌లోని సోమేశ్వర్, విదిశకు చెందిన విజయా దేవి ఆలయాల తలుపులు తెరవలేదని పేర్కొన్నారు.


గతంలో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఉమాభారతి కేంద్రమంత్రిగా పనిచేశారు. ఇక 2003 అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో బీజేపీని విజయతీరాలకు చేర్చి ముఖ్యమంత్రి అయ్యారు. 1994 నాటి హుబ్లీ అల్లర్ల కేసుకు సంబంధించి ఉమాభారతిపై అరెస్టు వారెంట్ జారీ కావడంతో ఆమె 2004 ఆగస్టులో సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే ఆ కేసు తేలినా బీజేపీ నాయకత్వం మాత్రం ఆమెకు మళ్లీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు.


ఇక 2014లో ఎన్డీఏ విజయం సాధించిన తర్వాత నరేంద్ర మోదీ కేబినెట్‌లో కేంద్రమంత్రిగా పనిచేశారు. అప్పుడు ఆమె ఉత్తర్‌ప్రదేశ్ నుంచి గెలిచి ప్రధాని మోదీ కేబినెట్‌లో చేరారు. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఉమాభారతి పోటీ చేయలేదు. ఈ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానైనా తన సేవలను పార్టీ ఉపయోగించుకుంటుందని భావించినా.. పార్టీ ప్రకటించిన 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పేరు లేకపోవడంతో ఆమె తీవ్ర నిరాశ చెందారు. ఈ క్రమంలోనే హిమాలయాలకు వెళ్తున్నట్లు శనివారం ట్విటర్‌లో ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com