ఆదివారం కేరళలో జరిగిన బాంబు పేలుడు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం అయింది. ఓ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ పేలుడులో ఒకరు మృతి చెందగా.. 40 మందికిపైగా తీవ్ర గాయపడ్డారు. ఈ క్రమంలోనే దేశంలోని ప్రముఖ నగరాల్లో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. కేరళ బాంబు పేలుళ్ల ఘటనతో దేశ రాజధాని ఢిల్లీతోపాటు ముంబయిలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆ రెండు నగరాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. పేలుళ్లు జరగడంతో రద్దీగా ఉండే ప్రాంతాల్లో మరింత భద్రతను ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఇక ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ముంబైలోని యూదుల కేంద్రమైన చాబాద్ హౌస్ వద్ద ఇప్పటికే భద్రతను పెంచారు. ప్రస్తుతం దేశంలో పండుగల సీజన్, వన్డే ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తుండటంతో ముంబైలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలతో అనుక్షణం టచ్‌లో ఉన్నట్లు ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం వెల్లడించింది. ఏదైనా అనుమానిత సమాచారం అందితే తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మరింత భద్రతాపరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటన విడుదల చేశారు.
కేరళ బాంబు పేలుడు ఘటనకు సంబంధించి సీఎం పినరయ్ విజయన్‌తో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మాట్లాడారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని ఎన్‌ఐఏ, ఎన్‌ఎస్‌జీ ఉన్నతాధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఉగ్రవాద నిరోధక పరిశోధనలు, కార్యకలాపాల్లో నైపుణ్యం కలిగిన రెండు కేంద్ర ఏజెన్సీలకు చెందిన ప్రత్యేక బృందాలను సంఘటనా స్థలానికి పంపాలని అమిత్ షా సూచించారు. ఘటనా స్థలానికి ఎన్‌ఐతోపాటు ఇతర దర్యాప్తు సంస్థలు చేరుకున్నట్లు కేరళ మంత్రులు వీఎన్ వాసవన్, ఆంటోనీ రాజులు పేర్కొన్నారు. కేరళలోని కలమస్సేరి సమీపంలో ఉన్న ఓ కన్వెన్షన్ సెంటర్‌లో ఆదివారం ఉదయం 9.40 గంటలకు భారీ పేలుడు సంభవించింది. కొచ్చికి 10 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. 3 రోజుల ప్రార్థనల్లో భాగంగా ఆదివారం చివరి రోజు కావడంతో దాదాపు 2 వేల మంది ప్రజలు ఆ ప్రార్థనలకు హాజరయ్యారు. ఈ పేలుడులో ఐఈడీ పదార్ధాలను ఉపయోగించినట్లు కేరళ పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ‘కలమస్సేరీలోని జమ్రా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో ఉన్న ప్రత్యక్షసాక్షులు చెప్పిన వివరాల ప్రకారం రెండు పేలుళ్లు జరిగినట్లు అంచనా వేస్తున్నామని.. కేరళ డీజీపీ షేక్ దార్వేశ్ సాహెబ్ తెలిపారు.ఐఈడీ కారణంగానే భారీ పేలుడు సంభవించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని.. పేలుళ్లకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.
ఈ పేలుళ్లలో ఒకరు చనిపోగా.. 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో పది మంది 50 శాతానికిపైగా కాలిన గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు కేరళ పోలీసులు వెల్లడించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే, విద్వేషపూరిత మెసేజ్‌లు వ్యాప్తి చేయొద్దని.. అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పేలుళ్ల ఘటనతో అప్రమత్తమైన కేరళ అధికారులు.. 14 జిల్లాల్లోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లలో భద్రతను కట్టుదిట్టం చేశారు.