విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కొత్తవలస మండలం కంటకాపల్లి-అలమండ మధ్య ఆదివారం రాత్రి ఏడు గంటల సమయంలో ఓ ప్యాసింజర్ రైలు.. ఆగి ఉన్న మరో ప్యాసింజర్ రైలును ఢీ కొట్టింది. ఆపై పక్క ట్రాక్‌లోని గూడ్స్ రైలుపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. అలాగే ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటించారు. సీఎం విజయనగరం పర్యటనకు వెళ్లారు. అక్కడ రైలు ప్రమాదంలో గాయపడిన బాధితుల్ని పరామర్శిస్తారు.
ట్రాక్ పునరుద్దరణ పనులు పూర్తి
విజయనగరంలో రైలు ప్రమాద ఘటనా స్థలిలో ట్రాక్ పునరుద్దరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేశారు. ట్రాక్ మరమ్మతులు పూర్తి కావడంతో ఒకేసారి రెండు రైళ్లను వదిలారు. గూడ్సు రైలును పంపి సామర్ధ్యాన్ని పరీక్షించారు. దీంతో ప్రమాదం జరిగిన 20 గంటల్లో ట్రాక్ అందుబాటులోకి వచ్చింది. ట్రాక్ టెస్ట్ విజయవంతం కావడంతో కాసేపట్లో ప్యాసింజర్ రైళ్లను అనుమతించనున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయనగరం జిల్లా పర్యటనలో స్వల్ప మార్పు
ఏపీ సీఎం వైఎస్ జగన్ విజయనగరం జిల్లా పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. రైల్వే అధికారుల విజ్ఞప్తి మేరకు రైలు ప్రమాద ఘటనా స్ధల పరిశీలనకు కాకుండా నేరుగా ఆసుపత్రికి వెళ్లనున్నారు. ఘటనా స్ధలంలో ప్రమాదానికి గురైన బోగీలను తొలగించి యుద్ద ప్రాతిపదికన ట్రాక్ పునురుద్ధరణ పనులు చేపడుతున్నట్టు అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి ఘటనా స్ధలానికి వస్తే.. ట్రాక్ పునరుద్ధరణ పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉందని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు. దీంతో ఘటనా స్ధల పరిశీలనకు కాకుండా.. సీఎం నేరుగా విజయనగరం వెళతారు. విజయనగరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శిస్తారు. పూర్తి కథనం
బాధితుల బాధ్యత ప్రభుత్వానిదే: మంత్రి బొత్స
రైలు ప్రమాద బాధితులకు ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడేవరకు ప్రభుత్వం దే బాధ్యత అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని.. మృతులు కుటుంబాలకు రూ. 10లక్షల ఆర్థికసాయం అందిస్తామన్నారు. తీవ్రంగా గాయపడిన వాళ్లకు రూ. 2లక్షలు.. సాధారణ గాయాలైనవాళ్లకు రూ. 50 వేల సాయం ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఏపీ ప్రభుత్వ యంత్రాంగం సత్వరమే స్పందించి సహాయక చర్యలు చేపట్టిందని.. రైల్వే అధికార్ల సమన్వయంతో పనిచేస్తున్నామన్నారు. ట్రాక్ పునఃనిర్మాణ పనులు కాసేపట్లోనే పూర్తి అవుతాయన్నారు.
విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటన బాధితులకు టీడీపీ అండ
విజయనగరం జిల్లా రైలు ప్రమాదం ఘటనకు సంబంధించి సహాయక చర్యల్లో పాల్గొనేందుకు తెలుగుదేశం పార్టీ రెండు బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు క్షేత్రస్థాయిలో బాధితులకు అన్ని విధాలుగా సహాయ, సహకారాలు అందిస్తాయన్నారు టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ప్రమాదంలో గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి, మెరుగైన వైద్య అందేలా చర్యలు తీసుకుంటారన్నారు. అలాగే ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను బృందం సభ్యులు పరామర్శిస్తారని తెలిపారు. వారికి తెలుగుదేశం పార్టీ అన్నివిధాలుగా అండగా నిలుస్తుందని.. ఈ రోజు ఉదయం నుంచి శ్రీకాకుళం,విజయనగరం, విశాఖ జిల్లాల ఇంఛార్జ్‌లతో , నేతలతో ఫోన్ ద్వారా మాట్లాడి సహాయ,పునరావాస కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఆదేశించామమన్నారు. ఆదివారం రాత్రి నుంచే తెలుగుదేశం పార్టీ శ్రేణులు సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయన్నారు. ప్రభుత్వం క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని.. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.
రైలు ప్రమాదం కారణంగా పలు రైళ్లు రద్దు
విజయవాడ రైల్వే డివిజన్‌పై రైలు ప్రమాదం ప్రభావం కనిపిస్తోంది. విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు చేశారు. విజయవాడ మీదుగా విశాఖ వెళ్లే రత్నాచల్, సింహాద్రి, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-పూరీ ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దయ్యాయి. 27 రైళ్లు రద్దు, 28రైళ్లను దారి మళ్లించారు. విజయవాడ రైల్వే జంక్షన్ లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు.. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
మృతుల గుర్తింపు
రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ ఘటనలో 15మంది చనిపోయినట్లు చెబుతున్నారు.. వీరిలో పలువురి వివరాలను వెల్లడించారు. రైలు ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఆరుగుర్ని బంధువులు గుర్తించారు. పూర్తి కథనం
ఆదివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో విశాఖ నుంచి పలాస ప్యాసింజర్ రైలు.. బయలుదేరి విజయనగరం వైపు బయలుదేరింది. అదే ట్రాక్‌పై వెనుకనే విశాఖ నుంచి రాయగడ ప్యాసింజర్ కొద్ది నిమిషాలకు బయలుదేరి వెళ్లింది. ఈ క్రమంలో సిగ్నల్ కోసం ఆగి ఉన్న రైలును.. రాయగడ రైలు ఢీకొట్టింది.